ఎలుక కాదు.. చికెన్‌ ముక్కేనంట!

Update: 2015-06-24 04:25 GMT
ఆ మధ్య పలు దేశాల్లో చర్చనీయాంశంగా మారిన కేఎఫ్‌సీ వారి ఎలుక వ్యవహారంపై తాజా అప్‌డేట్‌ ఒకటి వెల్లడైంది. దీనికి ముందు అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని వాట్స్‌ ప్రాంతానికి చెందిన డిక్సన్‌ అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌ పేజీలో పెట్టిన ఒక పోస్టింగ్‌ తీవ్ర సంచలనంగా మారింది. తాను కేఎఫ్‌సీకి వెళ్లి  చికెన్‌ ఆర్డర్‌ చేశారు. అతనికి ఇచ్చిన చికెన్‌ ముక్కలో ఎలుక ఆకారంలో ఉండటం.. దాన్ని తీసుకొని మేనేజర్‌ని సంప్రదిస్తే.. తనకు సారీ చెప్పారని పేర్కొంటూ.. తనకు లాయర్‌తో పని బడిందని.. ఫాస్ట్‌ఫుడ్‌ తిని ఆరోగ్యం పాడు చేసుకోకండన్న మాటతో పాటు.. ఫోటోను అప్‌లోడ్‌ చేశారు.

అచ్చు ఎలుక మాదిరి ఉన్న సదరు ఫోటో సోషల్‌ మీడియాలోనే కాదు.. పలుదేశాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా కేఎఫ్‌సీ కిందామీదా పడింది. అసలీ వ్యవహారానికి కారణమైన కస్టర్‌ డిక్సన్‌ను కలిసేందుకు కేఎఫ్‌సీ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తాజాగా అతని లాయర్‌ ఆ మాంసం ముక్కను ఓ ల్యాబ్‌కు అందించారు.

అయితే.. సదరు ల్యాబ్‌ వారి నివేదిక ప్రకారం.. అది ఎలుక మాంసం కాదని.. చికెన్‌ ముక్కేనని తేల్చారు. వెంటనే రంగంలోకి దిగిన కేఎఫ్‌సీ.. థర్డ్‌పార్టీ ల్యాబ్‌లో పరీక్షించిన విషయాన్ని వెల్లడిస్తూ.. ఒక వినియోగదారులు తమ నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారని.. దానిపై పరీక్షలు జరపగా అది చికెన్‌ ముక్కేనని తేలినట్లు పేర్కొంది. ఇన్ని రోజులకు తేల్చిన కేఎఫ్‌సీ.. మొదట స్టోర్‌ మేనేజర్‌ సారీ ఎందుకు చెప్పినట్లు..?

Tags:    

Similar News