ఈ హైదరాబాద్ అన్నాచెల్లెళ్ల క్రైం స్టోరీ తెలిస్తే షాకే

అడ్డదారిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయిలు వెనకేయటమేకాదు

Update: 2024-08-05 09:30 GMT

హైదరాబాద్ కు చెందిన అన్నాచెల్లెళ్ల క్రైం స్టోరీ తెలిస్తే నోట మాట రాదంతే. అడ్డదారిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోట్లాది రూపాయిలు వెనకేయటమేకాదు.. వందలాది మందిని ముంచేసిన వీరి దారుణాల వరసతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తవ్వే కొద్దీ నేరాలు.. వెతికే కొద్దీ వందలాది బాధితులు ఓవైపు.. మరోవైపు హైప్రొఫైల్ బిల్డప్ ఇస్తూ.. విలాసవంతమైన జీవితాన్ని గడిపే వీరి కోసం హైదరాబాద్ పోలీసులు మాత్రమే కాదు.. తెలంగాణ.. ఏపీ.. కర్ణాటక.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు వెతుకుతున్నారు.

30 ఏళ్ల లోపు వయసు మాత్రమే ఉన్న ఈ అన్నాచెల్లెళ్లకు దుర్మార్గాలకు విసిగిపోయిన బాధితులు.. వీరిని కిడ్నాప్ చేసే వరకు వెళ్లారంటే వారి టార్చర్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో గిగ్లైజ్ ఐటీ సంస్థ నిర్వాహకుడు 29 ఏళ్ల రవిచంద్రారెడ్డిని ఆయన సోదరి 27 ఏళ్ల వాకాటి యామిని అలియాస్ సౌమ్యల ఉదంతం సంచలనంగా మారింది. జీతాలు ఇవ్వకపోవటంతో విసిగిపోయిన ఉద్యోగులు వారిని గట్టిగా నిలదీయటంతో పాటు.. తమ జీతాల్ని సెటిల్ చేసే వరకు బయటకు వెళ్లనివ్వమని బలవంతం చేశారు. అయితే.. దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు భావించారు.

అనంతరం విచారణ జరిపిన తర్వాత వీరి గురించి తెలిసిన పోలీసులు.. మరింత లోతుల్లోకి వెళ్లేసరికి వారి అసలు భాగోతం బయటపడింది. అదే సమయంలో ఈ అన్నాచెల్లెళ్లు ఇద్దరు ఎస్కేప్ అయ్యారు. రవిచంద్రారెడ్డి తన సంస్థలో 1200 మందిని బ్యాక్ డోర్ లో నియమించుకొని.. వేతనాలు చెల్లించకుండా ఉండేవాడు. వారంతా సక్రమ పద్దతిలో జాబ్ లోకి రాలేదన్న కారణంగా వారందరిని తొలగించాడు. ఈ మోసానికి సంబంధించి రవిచంద్రారెడ్డితో సహా మరికొందరిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో దాదాపు 115 మంది ఫిర్యాదులు చేశారు.

గొప్పల కోసం రవిచంద్రారెడ్డి ఏపీలోని ఒక గుడికి రూ.కోటి మొత్తాన్ని విరాళంగా ఇచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ చెక్కు ఇచ్చాడు. అది కాస్తా బౌన్స్ అయ్యింది. దీంతో ఆయనపై మరో కేసు నమోదైంది. రవిచంద్రారెడ్డి దాదాపు పాతిక కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నట్లు గొప్పలు చెప్పుకునేవాడు. అంతేకాదు.. ఫోర్బ్స్ లో 2.5 బిలియన్ల వ్యాపారం చేస్తున్నట్లు.. సేవారంగంలో ఉన్నట్లు కథనం వచ్చిందని చెబుతూ ఉద్యోగుల్ని నమ్మించే ప్రయత్నం చేసేవాడు.

ఈ అన్నాచెల్లెళ్లు పశ్చిమబెంగాల్ లో దాదాపు రూ.800 కోట్ల కుంభకోణంలోనూ పాత్ర ఉందని చెబుతున్నారు. రవిచంద్రారెడ్డి తరచూ శ్రీలంకకు.. ఆయన సోదరి దుబాక్ కు వెళ్లి జల్సాలు చేసి వస్తారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. రవిచంద్రారెడ్డి సోదరి సౌమ్య మీద మాదాపూర్ లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నట్లుగా మూడు కంప్లైంట్లు ఉన్నట్లుగా జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఒక కంపనీ పెట్టి దాదాపు రూ.12 కోట్లు.. విజయవాడలో ఒక సంస్థ పెట్టినట్లుగా చెబుతూ రూ.15 కోట్ల మేర కాజేసినట్లుగా గుర్తించారు.

ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోనూ వీరి కుటుంబం నంద్యాల ఎంపీ స్థానానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫు పోటీ చేసింది. ఈ సందర్భంగా ఆరు ఫార్చ్యూనర్ అద్దెకార్లు.. 30 మంది బౌన్సర్లును నియమించుకొని హడావుడి చేశారు. జూబ్లిహిల్స్ లో ఉండే అతడి ఇంటి అద్దె నెలకు రూ.2.5లక్షలని.. ప్రత్యేక జాతికి చెందిన మూడు కుక్కల్ని పెంచుకునే ఇతను.. ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానిని సైతం మోసం చేసినట్లుగా గుర్తించారు. ఇతగాడి ఘరానా మోసాలు పోలీసు శాఖలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News