కొడుకుపై నెపోటిజం.. అండగా అమితాబ్!

బాలీవుడ్‌లో నెపోటిజం అనే మాట ఎంత గట్టిగా వినిపించిందో అందరికీ తెలిసిందే. స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీపై ఎప్పుడూ ఒక విమర్శ ఉంటూనే ఉంటుంది;

Update: 2025-03-05 08:30 GMT

బాలీవుడ్‌లో నెపోటిజం అనే మాట ఎంత గట్టిగా వినిపించిందో అందరికీ తెలిసిందే. స్టార్‌ కిడ్స్‌ ఎంట్రీపై ఎప్పుడూ ఒక విమర్శ ఉంటూనే ఉంటుంది. కానీ, ఈ విషయంలో అభిషేక్ బచ్చన్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన నెపోటిజం వల్ల అవకాశాలు దక్కించుకున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నా, కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లు మాత్రం కఠినమైనవే. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అభిషేక్, సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటుడు.

బిగ్ బి క్రేజ్ ఉన్నప్పటికీ అతనికంటూ ఇప్పటివరకు సరైన మార్కెట్ క్రియేట్ కాలేదు. పలు సినిమాలను నిర్మించి నష్టపోయారు కూడా. ఇక ఐశ్వర్యారాయ్ తన లైఫ్ లోకి రావడంతో కూడా అతనిపై భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. అయితే అభిషేక్ మాత్రం స్టార్ డమ్ మొదటి సినిమాకు పనికొస్తుందేమో గాని ఆ తరువాత టాలెంట్ లేకుంటే ఇండస్ట్రీలో ఉండలేము అని కౌంటర్ ఇచ్చారు.

ఇక ఇటీవల ఓ నెటిజన్ అభిషేక్ బచ్చన్‌ టాలెంట్‌పై ప్రశంసలు చేస్తూ, అతను చాలామంచి సినిమాలు చేసినప్పటికీ అనవసరంగా నెపోటిజం ట్యాగ్‌ అతనిపై అట్టకట్టబడిందని ట్వీట్ చేయగా, అమితాబ్‌ బచ్చన్‌ దీనిపై స్పందించారు. “తండ్రిని కాబట్టి నేను ఈ మాట చెప్పడం లేదు, కానీ నిజంగా ఇదే నా ఫీలింగ్,” అంటూ అభిషేక్‌కి మద్దతుగా నిలిచారు. ఇండస్ట్రీలో నెపోటిజం ఉందా? లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే, ఎవరైనా టాలెంట్ ఉంటేనే నిలదొక్కుకుంటారని అమితాబ్ వ్యాఖ్యలు సూచించాయి.

అభిషేక్ కెరీర్ ప్రారంభం నుంచి బిగ్ హీరోగా ఎదగడానికి ప్రయత్నించాడని అందరికీ తెలుసు. ‘రిఫ్యూజీ’తో అరంగేట్రం చేసిన ఆయన ‘యువ’, ‘ధూమ్’, ‘గురు’ లాంటి సినిమాల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్‌లో కొన్ని విజయాలు సాధించినప్పటికీ, ఎక్కువగా ఫ్లాప్‌ సినిమాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ, తనదైన స్టైల్‌లో తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

అభిషేక్‌ మీద నెపోటిజం ట్యాగ్ అతని కెరీర్ మొత్తాన్నీ ప్రభావితం చేసిందా అంటే, కొంతవరకు నిజమే. కానీ, ఒక సినీ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అవకాశాలు వరుసగా వస్తాయని నమ్మడం పొరపాటే. అభిషేక్ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు చూసాడు. ఇదే విషయాన్ని గతంలో ఇంటర్వ్యూలో చెబుతూ, “నాన్న ఎప్పుడూ నా కెరీర్‌లో జోక్యం చేసుకోలేదు. ఎవరి దగ్గరనూ నాకోసం సినిమాలు అడగలేదు. నా సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించలేదు. కానీ, నేను మాత్రం ఆయన నటించిన ‘పా’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాను,” అని చెప్పాడు.

ఒకప్పుడు నెపోటిజం అనే విషయం పెద్దగా చర్చ కాకపోయినా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ప్రతి చిన్న విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. కేవలం ఇంటర్నెట్ ట్రోల్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంతమంది అభిషేక్‌ను పెద్ద స్టార్‌గా చూడలేకపోయారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తన కొడుకు గురించి చెప్పిన మాటలు హాట్‌ టాపిక్ అవుతున్నాయి. తండ్రిగా అండ ఇవ్వడమే కాదు, తన కొడుకు మంచి నటుడు అన్న విషయాన్ని కూడా గుర్తుచేశారు.

Tags:    

Similar News