హీరో గాయంపై నిర్మాత క్లారిటీ!
అసలు కార్తీకి ఏమైంది అంటూ చాలామంది సోషల్ మీడియాలో చర్చించడం కనిపించింది. ఎట్టకేలకు కార్తీ ప్రమాదం గురించి నిర్మాత లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు.;
తమిళ్ యంగ్ హీరో కార్తీకి షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న కార్తీని చిత్ర యూనిట్ సభ్యులు, ఆయన టీం మెంబర్స్ వీల్ చైర్‌లో కూర్చోబెట్టి ఆసుపత్రిలో జాయిన్ చేశారు అంటూ తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో కార్తీ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందారు. సినీ వర్గాల్లోనూ కార్తీ ఆరోగ్య విషయమై ఆందోళన వ్యక్తం అయింది. అసలు కార్తీకి ఏమైంది అంటూ చాలామంది సోషల్ మీడియాలో చర్చించడం కనిపించింది. ఎట్టకేలకు కార్తీ ప్రమాదం గురించి నిర్మాత లక్ష్మణ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం కార్తీ సర్దార్ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మైసూర్‌లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎస్ జే సూర్యతో కలిసి కార్తీ కీలకమైన యాక్షన్ సన్నివేశం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. యాక్షన్ సన్నివేశాల సమయంలో హీరోలకు ప్రమాదం జరగడం కామన్ విషయం. అయితే కార్తీకి జరిగిన ప్రమాదంతో కనీసం వారం నుంచి పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైద్యులు సూచించారట. దాంతో సర్దార్ 2 సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చామని నిర్మాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పుకొచ్చారు.
కార్తీ ప్రమాదం గురించి సర్దార్ 2 నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ... యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్న సమయంలో కార్తీ కాలు బెనికింది. అది పెద్ద గాయం కాదని, అయితే సాధారణ పరిస్థితి రావడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని వైద్యులు తెలియజేశారు. వచ్చే వారం నుంచి తిరిగి షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ఔట్ డోర్ యూనిట్ మొత్తం పూర్తి చేశామని, ఇక మిగిలి ఉన్న ఇన్‌డోర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన సర్దార్ సినిమా కేవలం తమిళ్‌లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సర్దార్ విడుదల అయినప్పటి నుంచి కూడా సీక్వెల్ కోసం ప్రేక్షకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు సర్దార్ 2 ను దర్శకుడు పిఎస్ మిత్రన్ ప్రారంభించారు. షూటింగ్ అంతా సాఫీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం బాధాకరం అని కార్తీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్దార్ 2 సినిమాలో మాళవిక మోహనన్, రజిషా విజయన్, అధిక రంగనాథ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.