సౌత్ డైరెక్టర్‌తో ఈ హిందీ స్టార్‌కి ఆఫర్ లేదా?
గౌతమ్ తిన్ననూరితో 'జెర్సీ' ఫ్లాపయ్యాక షాహిద్ కూడా సందీప్ కాకుండా ఇతర సౌత్ దర్శకులపై ఆసక్తిని చూపలేదు.
షాహిద్ కపూర్ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో అతడు ఒకడు. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'లో నటించి కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న తర్వాత ఇటు దక్షిణాది మీడియాలోను షాహిద్ పేరు మార్మోగింది. ఇప్పటివరకూ షాహిద్ కపూర్ కి కెరీర్ బెస్ట్ సినిమాని ఇచ్చిన ఘనత సందీప్ రెడ్డి వంగాకే దక్కింది. కెరీర్ లో పద్మావత్, హైదర్, కమీనీ, ఓంకార వంటి భారీ చిత్రాల్లో నటించాడు. ఇవేవీ షాహిద్ కి ఆశించినది ఇవ్వలేదు. అతడు బాలీవుడ్ అగ్ర దర్శకులతో పని చేసాడు. కానీ సోలోగా బంపర్ హిట్ ఇచ్చింది ఒక సౌత్ డైరెక్టర్. అది కూడా తెలుగు దర్శకుడు సందీప్ వంగాతోనే సాధ్యమైంది.
అందుకే ఇప్పుడు షాహిద్ మరోసారి సందీప్ వంగాతో కానీ.. ఎవరైనా ప్రముఖ సౌత్ డైరెక్టర్ తో కలిసి పని చేసే ఛాన్సుందా? అంటూ ఎదురు చూసారు అభిమానులు. కానీ షాహిద్ కి సందీప్ వంగాతో ఇప్పట్లో అవకాశం లేదు. అతడు ప్రభాస్ స్పిరిట్ కోసం పని చేస్తున్నాడు. ఇతర సౌత్ డైరెక్టర్లు కూడా షాహిద్‌తో ఎలాంటి సినిమాకి ప్లాన్ చేయడం లేదు. గౌతమ్ తిన్ననూరితో 'జెర్సీ' ఫ్లాపయ్యాక షాహిద్ కూడా సందీప్ కాకుండా ఇతర సౌత్ దర్శకులపై ఆసక్తిని చూపలేదు.
ఇటీవల ఓటీటీ సినిమా 'బ్లడీ డాడీ'లో షాహిద్ ఠిపికల్ పాత్రలో కనిపించాడు. డ్రగ్స్ అండర్ వరల్డ్ నేపథ్యంలో సినిమా ఇది. ప్రస్తుతం నటిస్తున్న 'దేవా'లోను అతడి పాత్ర ఇంటెన్స్ గా ఉంటుందని చెబుతున్నారు. ''చీకటి, భయంకరమైనది .. దుర్బలమైనది'' అని తన పాత్ర తీరు తెన్నులను షాహిద్ వర్ణించాడు. ఇంతలోనే తన తదుపరి పాత్ర కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు. ఈసారి అతడు కల్ట్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తో సినిమా చేస్తున్నాడు. గతంలో షాహిద్‌తో హైదర్, కమీనీ లాంటి చిత్రాలకు పని చేసిన విశాల్ భరద్వాజ్ అతడికి ఆశించిన బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వలేకపోయాడు. అయితే ఆ రెండు చిత్రాల్లో షాహిద్ నటనకు పేరొచ్చింది. అందుకే ఇప్పుడు మళ్లీ కల్ట్ డైరెక్టర్ తో డ్యాషింగ్ గా ప్రయోగానికి రెడీ అవుతున్న షాహిద్ పై చాలామందికి సందేహాలు తలెత్తాయి. షాహిద్ ఈ కల్ట్ దర్శకుడితో బ్లాక్ బస్టర్ ఇవ్వగలడా? మారిన ట్రెండ్ లో సౌత్ డైరెక్టర్ల హవా ముందు క్లాసిక్ లు తీసే కల్ట్ డైరెక్టర్ల పప్పులుడకడం లేదు. ఈ దశలో షాహిద్ ఆలోచన సరైనదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నేను ఇంతకుముందు చేయనిది ఇంకా కొత్తగా ఏం చేయగలను? అంటూ షాహిద్ ఉత్సాహంగానే ఉన్నాడు. అతడు కొత్తగా ఏం చేస్తాడో వేచి చూడాలి.
షాహిద్ కపూర్ -విశాల్ భరద్వాజ్ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ని నడియాడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాజిద్ నదియాడ్ వాలా నిర్మిస్తున్నారు. 2025 డిసెంబర్ 5న విడుదలవుతుంది. ఈ చిత్రంలో ట్రిప్తి డిమ్రీ కథానాయికగా నటిస్తోంది.