ఔత్సాహిక నటీనటులు.. సీనియర్ హీరో ఏం చెప్పారో విన్నారా?
తమ రోజుల్లో ఏవైనా తప్పులు ఉన్నా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఈ రోజుల్లో అలాంటి తప్పులు చేస్తే క్షమించడం లేదని అన్నారు.
మా రోజులతో పోలిస్తే ఈరోజుల్లో నవతరం నటీనటులు ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాలని, వారు తప్పు చేస్తే అంగీకరించేందుకు ప్రేక్షకులు సిద్ధంగా లేరని అభిప్రాయపడ్డారు అజయ్ దేవగణ్. మూడున్నర దశాబ్ధాలుగా బాలీవుడ్ లో కథానాయకుడిగా కొనసాగుతున్న అజయ్ దేవగణ్ తమ రోజుల్లో ఏవైనా తప్పులు ఉన్నా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఈ రోజుల్లో అలాంటి తప్పులు చేస్తే క్షమించడం లేదని అన్నారు.
నేటి ప్రేక్షకులు ఎక్కువ విచక్షణ, తెలివితేటలు కలిగి ఉన్నారని, తక్కువ క్షమించే అవకాశం ఉందని, దీంతో సినీపరిశ్రమలో కొత్తగా ప్రవేశించే వారికి ఇది మరింత సవాలుగా మారిందని దేవగన్ అభిప్రాయపడ్డారు. నేను పరిశ్రమలోకి ప్రవేశించినప్పటితో పోలిస్తే ఈరోజు ప్రేక్షకులు కొత్తవారిని స్వీకరించే విధానంలో చాలా తేడా ఉందని ఆయన అన్నారు. మా రోజుల్లో క్షమించేవారు..అంతగా తప్పులను పట్టించుకోలేదని అన్నారు.
అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించిన ఆజాద్ చిత్రంతో తన కజిన్ ఆమన్ దేవగన్, రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని నాయకానాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో గుర్రం పాత్ర కీలకంగా కనిపిస్తోంది. అమన్, రాషా తడానీ వంటి నేటితరం ప్రజల మెప్పు పొందడం అంత సులువు కాదనే అభిప్రాయం అజయ్ దేవగన్ వ్యక్తం చేసారు. ఈరోజుల్లో సినిమా వ్యాపారం తీరుతెన్నులు మార్చుకుందని ఆయన అన్నారు. అజయ్ మాట్లాడుతూ ``ఒకప్పుడు మనం ఏ సినిమాకైనా పనిచేస్తూనే నేర్చుకునేవాళ్లం. చాలా విషయాలు తెలుసుకోవడానికి చాలా సమయం, స్వేచ్ఛ ఉంది. ప్రేక్షకులు క్షమించేవారు.. మా తప్పులను పట్టించుకోలేదు. కానీ నేటి ప్రేక్షకులు చాలా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు..క్షమించరు. ఇది ప్రస్తుత నటీనటులు, రాబోవు నటీనటులపై చాలా అంచనాలను పెంచింది. వారు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి`` అని దేవగన్ అన్నారు.
ఆజాద్ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా, ప్రగ్యా కపూర్ నిర్మించారు. ఇది మనిషికి జంతువుకు మధ్య విడదీయరాని బంధంతో పాటు, విధేయత, ధైర్యం గురించిన సినిమా. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశంలో జరిగే కథాంశం. 19 ఏళ్ల గోవింద్ ప్రయాణం ఒక అద్భుతమైన గుర్రంతో ఎలా సాగింది? అన్నదే సినిమా కథాంశం. ఈ చిత్రం జనవరి 17న థియేటర్లలో విడుదల కానుంది.