అజిత్ ఫ్యాన్స్ కు షాకిస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్
గతేడాది కోలీవుడ్ లో వచ్చిన ది గోట్, తంగలాన్, ఇండియన్2, కంగువా లాంటి సినిమాలేవీ ఆడియన్స్ ను ఏ మాత్రం అలరించలేకపోయాయి.
గతేడాది కోలీవుడ్ లో వచ్చిన ది గోట్, తంగలాన్, ఇండియన్2, కంగువా లాంటి సినిమాలేవీ ఆడియన్స్ ను ఏ మాత్రం అలరించలేకపోయాయి. 2024లో కోలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాపులుగానే నిలవడంతో కోలీవుడ్ దర్శక నిర్మాతల ఆశలన్నీ 2025 పైనే ఉన్నాయి. దానికి తగ్గట్టే ఈ ఇయర్ కోలీవుడ్ లో రిలీజైన మదగజరాజా గ్రాండ్ సక్సెస్ అయింది.
దీంతో ఇప్పుడు ఆశలన్నీ అజిత్ కొత్త సినిమా విడాముయార్చిపైనే ఉన్నాయి. అజిత్ నుంచి సినిమా వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ క్రమంలో విడాముయార్చిపై అందరికీ మంచి అంచనాలున్నాయి. తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.
అజిత్ సరసన త్రిష నటించిన ఈ సినిమాలో అర్జున్, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. తమిళనాడులో 1000కి పైగా థియేటర్లలో విడాముయార్చి భారీ ఎత్తున రిలీజ్ కానున్నట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి.
అజిత్ వాలిమై కూడా తమిళనాడులో ఇలాగే రిలీజై మొదటిరోజు రూ.38 కోట్లు వసూలు చేసింది. విడాముయార్చి ఇంత భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో బుకింగ్స్ మాత్రం ఎక్కువ సెంటర్లలో యావరేజ్‌గానే చూపిస్తున్నాయి. చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో మాత్రం టికెట్ సేల్స్ పెరిగి, ఎక్కువ శాతం థియేటర్లలో హౌస్ ఫుల్స్ అయిపోయాయి.
బీ, సీ సెంటర్లలో మాత్రం టికెట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం వల్లే విడాముయార్చికి అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత అజిత్ నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ రాబోతుంది.