ఫ్లాప్‌ హీరో సూప‌ర్‌స్టార్‌లా కంబ్యాక్ అవుతాడా?

ఇప్పుడు అక్షయ్ కూడా షారూఖ్ మాదిరిగానే పెద్ద విజయాల‌తో ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నాన్ని చాటుకోవాల్సి ఉంటుంది.

Update: 2024-09-19 23:30 GMT

బ్యాక్ టు బ్యాక్ ఏడెనిమిది ఫ్లాప్ సినిమాల్లో న‌టించిన పెద్ద హీరో ఇటీవ‌లే ఒక చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ లో క‌నిపించాడు. ఐదు నిమిషాల అతిథి పాత్రే అయినా కానీ 500 కోట్ల క్ల‌బ్ చిత్రంలో న‌టించ‌గ‌లిగాడు. ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులు వేరే ఉన్నారు గ‌నుక క్రెడిట్ అత‌డికి ద‌క్క‌దు. అయినా కానీ ఒక పెద్ద హిట్ చిత్రంలో భాగం గ‌నుక అది అత‌డికి కొంత స‌హ‌క‌రిస్తుంది.

ఇలాంటి స‌మ‌యంలో స‌ద‌రు స్టార్ హీరో క‌చ్ఛితంగా త‌న సొంత సోలో సినిమాతో పెద్ద విజ‌యాన్ని అందుకోవాల్సి ఉంది. లేదా ఏదైనా విజ‌య‌వంత‌మైన‌ మ‌ల్టీస్టార‌ర్ లో పూర్తి స్థాయి ఛాలెంజింగ్ పాత్ర‌లో క‌నిపించినా అది ఉప‌క‌రిస్తుంది. అదే స‌మ‌యంలో త‌న‌కంటే ముందు అద్భుత‌మైన 1000 కోట్ల క్ల‌బ్ సినిమాల‌తో కంబ్యాక్ అయిన స‌హ‌చ‌ర హీరోని అత‌డు స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. తాను వెయ్యి కోట్ల క్ల‌బ్ లో చేర‌క‌పోయినా కానీ, క‌నీసం 500 కోట్లు వ‌సూలు చేయ‌గ‌లిగే సినిమాతో స‌త్తా చాటాల్సి ఉంటుంది. ఈ ఎపిసోడ్ లో స్టార్ హీరోలు ఎవరో ఊహించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు.

బ్యాక్ టు బ్యాక్ వ‌రుస ఫ్లాపుల్లో న‌టించిన స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ గురించే ఇదంతా. అక్కీ చాలా కాలంగా బ్లాక్ బ‌స్ట‌ర్ కోసం వేచి చూస్తున్నాడు. అతడు స్ఫూర్తి తీసుకోవాల్సింది మ‌రెవ‌రినో కాదు.. కింగ్ ఖాన్ షారూఖ్‌ని. బాద్‌షా కొన్ని వ‌రుస ఫ్లాపుల‌తో చితికిపోయిన స‌మ‌యంలో కొంత స‌మ‌యం తీసుకుని, హ్యాట్రిక్ హిట్ అందుకుని గ్రేట్ కంబ్యాక్ ఎలా ఉంటుందో చూపించాడు. వ‌రుస‌గా రెండు 1000 కోట్ల క్లబ్ సినిమాల్లో న‌టించ‌డం మ‌రో ఘ‌న‌త‌. ప‌ఠాన్, జ‌వాన్ తో ఖాన్‌కి ఇది సాధ్య‌మైంద‌. మూడో ప్ర‌య‌త్నం 'డంకీ' చిత్రం కూడా చెప్పుకోద‌గ్గ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇప్పుడు అక్షయ్ కూడా షారూఖ్ మాదిరిగానే పెద్ద విజయాల‌తో ఘ‌న‌మైన పున‌రాగ‌మ‌నాన్ని చాటుకోవాల్సి ఉంటుంది.

అయితే అత‌డు న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ 'సింగం ఎగైన్'పైనే ఆశ‌ల‌న్నీ. రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇత‌ర అగ్ర తార‌ల‌తో క‌లిసి అక్ష‌య్ న‌టిస్తున్నా కానీ అత‌డి పాత్ర సినిమా ఆద్యంతం బోలెడంత వినోదం, యాక్ష‌న్ క‌ల‌గ‌లుపుతో ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని చెబుతున్నారు. స్త్రీ 2తో 500 కోట్ల క్ల‌బ్ చిత్రంలో న‌టించిన ఘ‌న‌త అక్ష‌య్ కి ద‌క్కింది. ఇప్పుడు సింగం ఎగైన్ తోను అత‌డు ఇలాంటి ఫీట్ సాధించాల్సి ఉంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. క‌ష్టంలో ఉన్న‌ అక్ష‌య్ కి స‌రైన స‌మ‌యంలో 'సింగం ఎగైన్' గ్రేట్ కంబ్యాక్ ని ఇస్తుందా లేదా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.

Tags:    

Similar News