పన్ను చెల్లింపుల్లో విజయ్ - అల్లు అర్జున్ గ్రేట్
పన్ను చెల్లింపుల్లో కింగ్ ఖాన్ షారూఖ్ నంబర్ 1 స్థానంలో నిలవగా నంబర్ 2 స్థానంలో సౌత్ కి చెందిన అగ్ర హీరో దళపతి విజయ్ నిలిచారు.
పన్ను చెల్లింపుల్లో కింగ్ ఖాన్ షారూఖ్ నంబర్ 1 స్థానంలో నిలవగా నంబర్ 2 స్థానంలో సౌత్ కి చెందిన అగ్ర హీరో దళపతి విజయ్ నిలిచారు. ఖాన్ 92 కోట్ల పన్ను చెల్లించగా, విజయ్ ఏకంగా 80కోట్ల పన్ను చెల్లించి ఆశ్చర్యపరిచాడు. పన్ను చెల్లింపుల్లో తన చిత్తశుద్ధిని చాటుకున్న సౌత్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
దాదాపు 7300 కోట్ల నికర సంపదలు ఉన్న షారూఖ్ ఖాన్ .. కేవలం 410 కోట్ల ఆస్తులున్న విజయ్ తో పోలిస్తే చాలా తక్కువ మొత్తం చెల్లింపులు చేసాడనేది ఒక విశ్లేషణ. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సహా భారీగా వ్యాపారాలు ఉన్న షారూఖ్ ఖాన్ వంద కోట్ల లోపు పన్ను చెల్లింపులు మాత్రమే చేసారు. అయినా అతడు నంబర్ -1 చెల్లింపుదారుగా అరుదైన గౌరవం అందుకున్నాడు. ఇక బాద్ షా షారూఖ్ పఠాన్- జవాన్ లాంటి 1000 కోట్ల క్లబ్ సినిమాల్లో నటించి భారీ పారితోషికాలు అందుకోగా, విజయ్ గత ఏడాది `లియో` లాంటి యావరేజ్ సినిమా మాత్రమే చేసాడు. ఇక షారూఖ్ తో పోలిస్తే విజయ్ కి భారీ ఆదాయ మార్గాలు చాలా తక్కువ అనేది విశ్లేషకుల మాట.
ఇకపోతే అధిక పన్ను చెల్లింపుదారుల్లో టాప్ 20 జాబితాలో నిలిచిన ఏకైక పేరు అల్లు అర్జున్ మాత్రమే. అతడు 17 కోట్ల పన్ను చెల్లింపులతో టాలీవుడ్ నం.1గా నిలిచాడు. పుష్ప చిత్రంతో సంచలన విజయం అందుకుని ఇటీవల పుష్ప 2 చిత్రీకరణలో బన్ని బిజీగా ఉన్నాడు. అయితే బన్నీకి మల్టీప్లెక్స్ రంగం నుంచి ఆదాయం ఉంది. అతడు ఏఏఏ సినిమాస్ ని స్థాపించిన సంగతి తెలిసిందే. అమీర్ పేట్ లో ఈ థియేటర్లు బిగ్ సక్సెస్ అయ్యాయి. ఇదే గాక ఓటీటీ రంగంలో అల్లు వారి `ఆహా` హవా గురించి తెలిసినదే. విభిన్న వ్యాపారాలు, పారితోషికాలతో భారీ ఆదాయం ఆర్జించడమే కాదు, తీసుకున్నది తిరిగి ఇవ్వడంలోను అల్లు అర్జున్ మేటి అని నిరూపణ అయింది.