అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహావిష్కరణ
లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్ అల్లు బిజినెస్ పార్క్ లో ఆవిష్కరించారు
లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్ అల్లు బిజినెస్ పార్క్ లో ఆవిష్కరించారు. కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. కాంస్య విగ్రహాన్ని రామలింగయ్య మునిమనవడు, అల్లు అర్జున్ నటవారసుడు అల్లుఅయాన్ ఆవిష్కరించారు.
దివంగత నటుడు అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో గొప్ప హాస్యనటుల్లో ఒకరు. ఆయన మన మధ్య ఉన్నా లేకపోయినా నటుడిగా హృదయాల్లో నిలిచి ఉన్నారు. సినిమాల్లో ఆయన నటన.. మాట విరుపు.. హాస్య చతురత.. బాడీ లాంగ్వేజ్ రూపంలో ఎప్పుడూ జ్ఞాపకాల్లో నిలిచిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో అల్లు రామలింగయ్య సినిమా చూడని, కనీసం ఆయన గురించి వినని ప్రజలు లేరు. నేటి తరానికి కూడా రామలింగయ్య గురించి, ఆయన అపురూపమైన వారసత్వం గురించి తెలుసు. హాస్యానికి ఆయన ఒక సింబల్. అల్లు రామలింగయ్య టైమింగ్ రేలంగి, రాజాబాబు వంటి వారిని మించినది. రామలింగయ్య ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ఆయనను అసాధారణ నటుడిగా నిలబెట్టాయి.
కామెడీకి అల్లూ ఒక నిర్వచనం.. బెంచ్‌మార్క్.. అతడి గొప్ప ప్రదర్శనలు ప్రేక్షక ప్రపంచాన్ని నవ్వించాయి... అతడిలోని ఉద్విగ్నత ఏడిపించింది. హాస్యాన్ని మించి ఎమోషన్ ని పండించిన నటుడు. 1అక్టోబరు 1922న జన్మించిన అల్లు రామలింగయ్య తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్ & వైట్ యుగంలో దిగ్గజ నటులలో ఒకరు. అల్లూ కామిక్ టైమింగ్ నటన నేటితరం కమెడియన్లకు స్ఫూర్తి. అనేక తరాలను ఆయన ప్రేరేపించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైబడిన కెరీర్‌తో తెరపై తన నటన ద్వారా హాస్యానికి చిహ్నంగా నిలిచారు. అల్లు రామలింగయ్య ఐదు దశాబ్దాల పాటు 1000 పైగా చిత్రాలలో నటించారు. ముఖ్యంగా సినీరంగానికే ఆయన అంకితమయ్యారు. తన కుటుంబాన్ని అంకితమిచ్చారు. పరిశ్రమలో కొన్ని అత్యున్నత పురస్కారాలను రామలింగయ్య అందుకున్నారు. కళలకు ఆయన చేసిన కృషికి 2001లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 1990 సంవత్సరంలో తెలుగు సినిమాకి చేసిన విశేష కృషికి భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 1999లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ విభాగంలో సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అల్లూ విగ్రహాన్ని విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్‌లో, అలాగే స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్ పాలకొల్లులోను ఆవిష్కరించారు.
అసమాన ప్రతిభావంతుడు అల్లు రామలింగయ్యపై భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయడం గొప్ప గౌరవం. నిజానికి ఆయన నటుడు కాకముందు హోమియోపతి వైద్యుడు. వైద్యుడిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంత బిజీగా ఉన్నా తన వృత్తిని మాత్రం వదిలిపెట్టలేదు. సినిమా నటులకు వీలైనప్పుడల్లా వైద్యసేవలు కూడా అందించారు. అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞ కేవలం నటుడిగా లేదా హాస్యనటుడిగా మాత్రమే పరిమితం కాలేదు. ఆయన నిర్మాతగాను సుప్రసిద్ధులయ్యారు.
నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. మాయాబజార్, మిస్సమ్మ, ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సప్తపది, యమగోల, ఆత్మగౌరవం, శివరంజని సహా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కెరీర్ లో చిరస్మరణీయమైన నటనను అందించి, తన అద్భుతమైన కామెడీతో మనల్ని నవ్వించిన అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా అభిమానులు నేడు ఆయనను సంస్మరించుకున్నారు.