#ఫిలింఫేర్ .. తెలుగోడి ప్ర‌తిభ‌కు 19 నామినేష‌న్లు

ఇప్పుడు తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ తెర‌కెక్కించిన యానిమ‌ల్ ఏకంగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో 19 నామినేషన్లను పొందింది

Update: 2024-01-17 05:50 GMT

2023 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా 'యానిమ‌ల్' సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. జ‌వాన్- ప‌ఠాన్ త‌ర్వాత అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమా ఇది. బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 910 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఇలాంటి చిత్రానికి తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ వంగా నిర్ధేశ‌కుడు కావ‌డం కూడా చెప్పుకోద‌గిన‌ది. క‌బీర్ సింగ్ తో షాహిద్ కి, యానిమ‌ల్ తో ర‌ణ‌బీర్ కి గొప్ప పేరు తెచ్చింది సందీప్ వంగా అంటే అతిశ‌యోక్తి కాదు. ర‌ణ‌బీర్ కి కెరీర్ బెస్ట్ రోల్ ఇచ్చింది సందీప్ వంగా.

ఇప్పుడు తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్ తెర‌కెక్కించిన యానిమ‌ల్ ఏకంగా 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2024లో 19 నామినేషన్లను పొందింది. ఉత్తమ చలనచిత్రం.. ఉత్త‌మ న‌టుడు.. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు.. ఉత్త‌మ సంగీత‌ద‌ర్శ‌కుడు.. ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు.. ఉత్త‌మ స‌హాయ న‌టి.. స‌హా ప‌లు విభాగాల్లో యానిమ‌ల్ పోటీప‌డుతోంది. అరిజిత్ సింగ్ -భూపిందర్ బబ్బల్ వరుసగా సత్రాంగ -అర్జన్ వైలీ లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ల‌ను ఆల‌పించ‌గా వారు ఉత్తమ నేపథ్య గాయకులు (పురుషుడు)గా నామినేషన్‌లను పొందారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా, సురేష్ బండారు ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో పోటీప‌డ‌నున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ నేప‌థ్య సంగీతం నామినేషన్ సంపాదించింది.

ఉత్తమ సినిమాటోగ్రఫీ (అమిత్ రాయ్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సురేష్ సెల్వరాజన్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (శీతల్ శర్మ), ఉత్తమ సౌండ్ డిజైన్ (సింక్ సినిమా), ఉత్తమ ఎడిటింగ్ (సినిమా) .. ఉత్తమ యాక్షన్ (సుప్రీమ్ సుందర్), ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ వంటి విభాగాల్లో నామినేషన్ లు ద‌క్కాయి. 10 పైగా ఫిలింఫేర్ ల‌తో యానిమ‌ల్ సంచ‌ల‌నం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని కూడా అంచనా వేస్తున్నారంటే ఈ సినిమా ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందో అర్థం చేసుకోవ‌చ్చు.

విడుద‌ల‌కు ముందే 'యానిమ‌ల్' చాలా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంది. ఈ సినిమా తెర‌కెక్కించిన తెలుగోడు సందీప్ రెడ్డి వంగాపై దారుణ‌మైన కామెంట్లు చేసారు. సినిమా రిలీజ‌య్యాకా విమ‌ర్శ‌ల ప‌రంప‌ర కొన‌సాగింది. సెల‌బ్రిటీలు, ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు విమ‌ర్శించి ఆ త‌ర్వాత నాలుక్క‌రుచుకున్నారు. తాము చేసిన‌వి త‌ప్పుడు కామెంట్లు అని కూడా అంగీక‌రించారు. అయితే అన్నిటికీ సందీప్ వంగా బాక్సాఫీస్ విజ‌యంతో ఘ‌న‌మైన‌ స‌మాధాన‌మిచ్చాడు. ఇక కొస‌రు (బ్యాలెన్స్) సందేహాలు ఏవైనా మిగిలి ఉంటే అన్నిటికీ ఫిలింఫేర్‌ల‌తో ఆన్స‌ర్లు రెడీ అవుతాయేమో!

Tags:    

Similar News