యానిమల్ మూవీ.. ఇదేం కొత్త గొడవ బాబు?
మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లేపై ప్రశంసలు కురిపిస్తూ మీమ్స్, వీడియోలు తెగ ఆకట్టుకున్నాయి.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.915 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. 2023 సంవత్సరంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్ లో మోత మోగిపోయింది.
మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లేపై ప్రశంసలు కురిపిస్తూ మీమ్స్, వీడియోలు తెగ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు వాళ్ల కోరిక తీరుస్తూ జనవరి 26 అర్ధరాత్రి నుంచి యానిమల్ ను స్ట్రీమింగ్ చేసింది ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందీ సినిమా.
అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయ్యామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఓటీటీలో ఈ సినిమా థియేట్రికల్ వెర్షన్ నే పెట్టేశారని, ఎక్స్ ట్రా సీన్స్ యాడ్ చేస్తామనని చెయ్యలేదని చెబుతున్నారు. ఇది పక్కన పెడితే.. ఈ సినిమా కోసం సోషల్ మీడియాలో ఫ్యాన్స్, నెటిజన్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలేం జరిగిందంటే?
వాస్తవానికి.. థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మహిళలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయంటూ పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు సైతం తప్పుపట్టారు. ఈ సినిమా.. మహిళలు పట్ల ద్వేషాన్ని పెంపొందించేలా ఉందంటూ పలు సందర్భాల్లో కొందరు నెటిజన్లు కూడా విమర్శించారు.
తాజాగా ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యాక కొందరు నెటిజన్లు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి చిత్రాలను ఎలా ప్రసారం చేస్తారని నెట్‌ఫ్లిక్స్ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి యానిమల్ మూవీ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. 'అసలు ఆ సినిమాకు ఏమైంది? నచ్చకపోతే చూడడం మానేయాలి? అంతేగానీ సినిమాను ఎలా తీసేమంటారు?' అని ట్వీట్లు చేస్తున్నారు. మరి ఈ ట్వీట్ల వార్ ఎప్పుడు ఎండ్ అవుతుందో చూడాలి.