గేమ్ ఛేంజర్.. నా కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్: అంజలి
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. వారు సినిమా గురించి మాట్లాడిన విధానం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేజర్ సినిమా ఈ సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే తారస్థాయికి చేరాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా ఫ్యాన్స్‌కు ఎంతగానో కిక్కిచ్చింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. వారు సినిమా గురించి మాట్లాడిన విధానం కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ముఖ్యంగా నటుడు శ్రీకాంత్, అంజలి వారి అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ముందుగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ఒక్క ముక్కలో గేమ్ చేజర్ గురించి చెప్పాలి అంటే, దర్శకుడు శంకర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్‌లో మా నాన్నను నేను చూశాను. అంతగా నాకు ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయింది.
రామ్ చరణ్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. లైవ్లో అతని పర్ఫార్మెన్స్ చూస్తే, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా అతని వర్క్ విధానం చాలా గొప్పగా అనిపించింది. ఇంతకుముందు అతడితో గోవిందుడు అందరివాడేలే సినిమా చేశాను. ఇప్పుడు అతడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే, అతను ఎక్కడికో వెళ్లిపోయాడు అనిపిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్, ఆ టాలెంట్, ఆ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఈ సినిమా అతని కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. శంకర్ గారికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మదర్ కూడా ఈ సినిమాని చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు," అని శ్రీకాంత్ తెలియజేశారు.
ఇక అంజలి మాట్లాడుతూ, "గేమ్ చేజర్ నా పర్సనల్ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది. కొన్ని క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు దాని నుంచి బయటకు రావడానికి చాలా కష్టం అవుతుంది. గేమ్ చేజర్‌లో నేను చేసిన పాత్ర కూడా అలాంటిదే. అంత బ్యూటిఫుల్‌గా శంకర్ గారు ఈ రోల్ రాశారు. ఆయన లాంటి డైరెక్టర్‌తో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ ఇలాంటి పవర్‌ఫుల్ రోల్ చేయడం చాలా అరుదు.
ఈ విషయంలో నేను ఎంతో లక్కీగా ఫీల్ అవుతున్నాను. రామ్ చరణ్‌తో నటించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన బెస్ట్ కోస్టార్ అని నేను ఎప్పుడో చెప్పాను. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, సురేష్ గార్లకు కూడా చాలా థాంక్స్. సినిమా ఎలా ఉంటుందో జనవరి 10న మీరు చూస్తారు. మీకు ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. కానీ, ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెబుతున్నాను. తమన్ మంచి సంగీతం అందించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి ముందుగానే విషెస్ చెబుతున్నాను" అని అంజలి తెలిపారు.