ఫేక్ కాస్టింగ్ కాల్స్‌తో జాగ్ర‌త్త‌: అన్న‌పూర్ణ స్టూడియోస్

తాజాగా పాపుల‌ర్ నిర్మాణ సంస్థ‌లు మోస‌పూరిత కాస్టింగ్ కాల్స్ పై హెచ్చ‌రించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ కాస్టింగ్ కాల్స్ పై గట్టి వార్నింగ్ ఇచ్చింది.

Update: 2024-07-29 15:14 GMT

మోస‌పూరిత కాస్టింగ్ కాల్స్ గురించి ఇటీవల అవ‌గాహ‌న పెరుగుతోంది. అయినా ఔత్సాహిక ఆర్టిస్టులు కొన్నిసార్లు మోస‌గాళ్ల భారిన ప‌డి డ‌బ్బు పోగొట్టుకుంటున్నారు. మ‌హిళా న‌టీమ‌ణులు అయితే తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. వీటిపై హెచ్చ‌రించ‌డ‌మే గాక అంద‌రిలో అవ‌గాహ‌న పెంచాల‌ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా)పై ఒత్తిడి ఉంది.

తాజాగా పాపుల‌ర్ నిర్మాణ సంస్థ‌లు మోస‌పూరిత కాస్టింగ్ కాల్స్ పై హెచ్చ‌రించాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ కాస్టింగ్ కాల్స్ పై గట్టి వార్నింగ్ ఇచ్చింది. సైబర్ నేరగాళ్లు టాప్ ప్రొడక్షన్ కంపెనీల పేర్లను ఉపయోగించుకుని, నటించే అవకాశాలను కల్పిస్తామని మ‌భ్య పెట్టి ట్రాప్ లో వేస్తున్నార‌ని హెచ్చ‌రిక‌ను జారీ చేసింది. త‌మ కంపెనీ పేరును ఉప‌యోగించుకునే ఆన్ లైన్ మ‌స‌గాళ్ల విష‌యంలో జాగ్రత్తగా ఉండాలని అన్నపూర్ణ స్టూడియోస్ ఓ ప్రకటనలో కోరింది. ఆర్టిస్టుల‌ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయ‌వద్దని, డబ్బు పంపవద్దని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని హెచ్చ‌రించారు. కాస్టింగ్‌కు సంబంధించిన అన్ని అధికారిక ప్రకటనలు ధృవీకరించిన అధికారిక‌ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్‌సైట్ ల‌లో మాత్ర‌మే ప్ర‌చురితం అవుతాయ‌ని ప్రొడక్షన్ హౌస్ స్పష్టం చేసింది.

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ గ‌తంలో ఇలాంటి మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌ను ఎదుర్కొంది. తమ సంస్థకు చెందినదిగా భావిస్తున్న నకిలీ ఇమెయిల్‌ల ద్వారా తప్పుడు సమాచారం పంపి ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని కంపెనీ గుర్తించింది. వారి అధికారిక ఇమెయిల్ చిరునామా (info@24FramesFactory.com) నుండి త‌ప్ప ఎలాంటి ఇత‌ర మెయిల్‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సూచించారు. నకిలీ ఈమెయిల్ ఐడీల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ ఉదంతాలను ఔత్సాహిక నటీన‌టులను లక్ష్యంగా చేసుకుని డ‌బ్బు సంపాదించే మోసపూరిత చ‌ర్చ‌లుగా చూడాలి. ఆన్‌లైన్ స్కామ్‌లతో పెరుగుతున్న ముప్పుపై ఇవ‌న్నీ హెచ్చ‌రికలు. ఇలాంటి దోపిడీకి వ్యతిరేకంగా నటీనటులకు రక్షణ కల్పించాలని మూవీ ఆర్టిస్ట్ సంఘాలు ప్ర‌య‌త్నించాల‌ని ప‌లువురు కోరుతున్నారు. నూత‌న ఆర్టిస్టుల్లో పెరిగిన అవగాహన, అప్రమత్తతతో ఇలాంటి మోసపూరిత కాస్టింగ్ కాల్‌ల బారిన పడకుండా తమను తాము రక్షించుకోవచ్చు.

Tags:    

Similar News