‘83’ ట్రైలర్: టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన కపిల్ దేవ్ టీమ్..!

Update: 2021-11-30 06:13 GMT
భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్‌ విజేత జట్టు కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ''83''. కబీర్‌ ఖాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కపిల్‌ దేవ్‌ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ నటించగా.. కపిల్‌ దేవ్‌ భార్య రోమీ దేవ్‌ గా రణవీర్‌ సతీమణి దీపికా పదుకునే కనిపించనున్నారు. నిజ జీవితంలో భార్యాభర్తలైన రణవేర్ - దీపికా.. సిల్వర్ స్క్రీన్ పై కూడా భార్యాభర్తలుగానే నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది.

అప్పుడెప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ''83'' చిత్రం కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హింది, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 3-డి వెర్షన్‌ లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా 3 నిమిషాల 49 సెకన్ల సుదీర్ఘ హిందీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా హీరో రణ్‌ వీర్‌ సింగ్‌ ట్వీట్ చేస్తూ.. ''అండర్‌ డాగ్స్‌ గా బరిలోకి దిగి ఊహించని విధంగా విజయం సాధించిన నిజ జీవిత అద్భుతమైన కథ. ట్రైలర్‌ హిందీ వెర్షన్‌ మీకోసం'' అని పేర్కొన్నారు. ట్రైలర్ విషయానికొస్తే.. టీమ్ ఇండియా 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచే ప్రయాణాన్ని చూపించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నీలో భారత జట్టు ఎదుర్కొన్న సవాళ్లు, ఇబ్బందులు, గెలిచిన తర్వాత ఆనందక్షణాలను ఇందులో చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన టీమిండియా.. ఫైనల్ లో వెస్టిండీస్ మీద గెలిచి ప్రపంచ కప్ తో స్వదేశానికి తిరిగి వచ్చిన ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను అలరిస్తోంది.

''83'' చిత్రంలో రణవీర్ - దీపికా తోపాటుగా పంకజ్ త్రిపాఠి - జీవా - తాహిర్ రాజ్ భాసిన్ - జతిన్ శర్మ - సాకీబ్ సలీం తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. దీపికా పదుకునే - కబీర్ ఖాన్ - విష్ణు వర్ధన్ ఇందూరి - సాజిద్ నాడియవాలా నిర్మాతలుగా వ్యవహరించారు. తెలుగులో అక్కినేని నాగార్జున - తమిళ్ లో కమల్ హాసన్ - మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ - కన్నడలో సుదీప్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.


Full View
Tags:    

Similar News