మరో యువ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన న్యాచురల్ స్టార్?

Update: 2022-11-08 07:17 GMT
ఘంటా నవీన్ బాబు అలియాస్ నాని ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15 ఏళ్లు కావస్తోంది. 2008లో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన 'అష్టా చమ్మ'తో నాని వెండితెరకు పరిచమయ్యాడు. పక్కింటి కుర్రాడిలా కన్పించడంతోపాటు చాలా సహజంగా నటించడం నానికి ప్లస్ అయింది. ఈ క్రమంలో అతడికి దర్శకుల నుంచి వరుసగా ఆఫర్లు రావడంతో బిజీగా మారిపోయాడు.

కెరీర్ తొలినాళ్లలో మినిమమ్ గ్యారంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నాని ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు. 'ఈగ' మూవీలో నటనకు గాను విమర్శల ప్రశంసలందుకున్నాడు. కుటుంబ కథాపరమైన చిత్రాల్లోనే నాని ఎక్కువగా నటించడంతో క్లాస్ హీరో అనే ముద్ర పడిపోయింది. మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం నాని ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఈ క్రమంలోనే నాని తనకు అచ్చి వచ్చిన ఫ్యామిలీ.. లవ్ జోనర్ లోనే సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. నాని కెరీర్ ను పరిశీలిస్తే ఎక్కువగా కొత్త దర్శకులతో నే పని చేశాడు. ఎంతోమంది డబ్ల్యూ డైరెక్టర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ప్రస్తుతం నాని.. కీర్తి సురేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'దసరా' కూడా కొత్త దర్శకుడితో చేస్తున్నదే కావడం విశేషం.
 
గతేడాది శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని ఈ ఏడాది 'అంటే సుందరానికి' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వచ్చే ఏడాది మార్చిలో 'దసరా' మూవీతో రాబోతున్నారు. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా సుముద్ర ఖని కీలక పాత్రలో కన్పించాడు. ఈ సినిమా పట్టాలపై ఉండగానే నాని మరో సినిమాను లైన్లో పెట్టాడనే టాక్ తాజాగా విన్పిస్తోంది.

శౌర్య అనే యువ దర్శకుడు నానికి ఇటీవల ఓ కథ విన్పించాడట. ఈ కథ నచ్చడంతోనే నాని అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. నానికి అచ్చొచ్చిన రోమాంటిక్ కామెడీ జోనర్ తరహాలోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ఈ మేరకు స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట. 'దసరా' తర్వాత యంగ్ డైరెక్టర్ శౌర్యతో నాని సినిమా ఉండనుందని తెలుస్తోంది.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే నాని హీరోగా ఉంటూనే నిర్మాతగానూ వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకెళుతున్నాడు. ఈ నేపథ్యంతో కొత్త సినిమా కూడా నానినే నిర్మాతగా ఉంటాడా?  లేదంటే ఇతర బ్యానర్లో వర్క్ చేస్తాడా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News