విచిత్ర ప‌రిస్థితిలో స్టార్ డైరెక్ట‌ర్ ?

Update: 2022-07-28 02:30 GMT
కొన్ని ప్రాజెక్ట్ లు స్టార్ డైరెక్ట‌ర్ల‌లో కొత్త ఉత్సాహాన్ని నింపితే మ‌రి కొన్ని మాత్రం వారి స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారుతుంటాయి. ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ని వ‌దిలేసి మ‌రో ప్రాజెక్ట్ కి వెళ్లిపోదామా అనే ఫ్ర‌స్ట్రేష‌న్ కు గురయ్యేలా చేస్తుంటాయి. ఇప్ప‌డు ఇదే అనుభ‌వాన్ని ఎదుర్కొంటున్నాడట‌ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్‌. కంగ‌న‌తో బాలీవుడ్ లో చేసిన `మ‌ణిక‌ర్ణిక‌`తో టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ లో చేరాల‌నుకున్నాడు. కానీ ఆ క్రెడిట్ మొత్తం నాదేన‌ని, సినిమా మొత్తం తానే చేసుకున్నాన‌ని కంగ‌న షాకిచ్చింది.

దీంతో తెలుగులో అయినా భారీ ప్రాజెక్ట్ ని తెర‌కెక్కించి టాప్ లీగ్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరాల‌ని నిర్ణ‌యించుకుని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో జాన‌ప‌ద పీరియాడిక్ మూవీకి రెడీ అయిపోయాడు. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ ప్రాజెక్ట్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. 17వ శ‌తాబ్దంలో మొఘ‌ల్ సామ్రాజ్యాన్ని ఆడుకున్న ఓ బందిపోటు గ‌జ‌దొంగ క‌థ‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ప్రాజెక్ట్ ని క‌రోనా కు ముందే సెట్స్ పైకి తీసుకెళ్లాడు.

విధి విచిత్రం క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికించ‌డం మొద‌లు పెట్ట‌డంతో కొంత మేర‌కు షూటింగ్ జ‌రిగిన త‌రువాత తాత్కాలికంగా ఆపేశారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ. ఎం. ర‌త్నం మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఏ.దయాక‌ర్ రావు తో క‌లిసి ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ షూటింగ్ మొద‌లైన‌ట్టే మొద‌లై మ‌ధ్య‌లో బ్రేక్ ప‌డుతూ వ‌స్తోంది. తాజాగ‌తా ఈ మూవీ షూటింగ్ ని ఇటీవ‌ల మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేశారు.

కానీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు వైర‌ల్ ఫీవ‌ర్ రావ‌డంతో షూటింగ్ షెడ్యూల్ మ‌ళ్లీ మారింది. ఆగ‌స్టులో చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే ఇంత వ‌ర‌కు ప‌వ‌న్ డేట్స్ కేటాయించ‌డం లేద‌ట‌. ఈ మూవీతో పాటు ప‌వ‌న్ త‌మిళ రీమేక్ `వినోదాయ సితం`ని కూడా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. దీనికి కూడా ఇంత వ‌ర‌కు ప‌వ‌న్ డేట్స్ కేటాయించ‌లేద‌ట‌. ఇది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో గ‌త కొంత కాలంగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` ప్రాజెక్ట్ ఆగుతూ సాగుతూ వుండ‌టంతో ద‌ర్శ‌కుడు అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. అదీ కాకుండా మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన చందంగా ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ కు పిలుపునివ్వ‌డం మ‌రింత‌గా క్రిష్ ని బాధిస్తోంద‌ట‌. ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం మాత్రం ఇప్ప‌టికే భారీ మొత్తాన్ని వెచ్చించ‌డంతో స‌హ‌నంగా వుంటూ త్వ‌ర‌లోనే చివ‌రి షెడ్యూల్ మొద‌లు పెడదామ‌ని ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News