ఇప్పటికీ తేజానే నా గురువంటున్నాడు

Update: 2016-04-23 13:30 GMT
ఓ స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో అవుదామనుకున్నాడు. ఓ పేరున్న దర్శకుడి సినిమాతో హీరోగా తొలి సినిమా చేశాడు. అది పెద్ద డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ హీరోగా అవకాశాలే లేకుండా పోయాయి. దీంతో ఇండస్ట్రీనే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ హీరోనే ఆది పినిశెట్టి. ఐతే తన తొలి సినిమా పెద్ద ఫ్లాప్ అయినప్పటికీ.. ఆ సినిమా తీసిన తేజను ఇప్పటికీ తన గురువుగా భావిస్తానని అంటున్నాడు ఆది. ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ముఖ్యమని... తన తొలి సినిమా సక్సెస్ కాకపోవడంతో తనకు కెరీర్ లేకుండా పోయిందని అతనన్నాడు. అయినప్పటికీ ‘ఒక విచిత్రం’ సినిమాను.. తేజాను ఎప్పటికీ మరిచిపోలేనని అతనన్నాడు.

‘‘ఇప్ప‌టికి ఒక విచిత్రం సినిమా గురించి చాలా మంది నాతో మాట్లాడుతుంటారు. స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది ప‌క్క‌న పెడితే నా తొలి సినిమాకు నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. అందుకే నా డైరెక్ట‌ర్ తేజా గారిని.. నిర్మాత దాస‌రి గారిని మరిచిపోలేను. అందరూ సినిమా బాగా రావాలనే కష్టపడ్డారు. ఐతే సినిమా ఆడుతుందా లేదా అనేది మ‌న చేతుల్లో ఉండ‌దు. ఒక న‌టుడిగా తేజ గారి నుంచి నుంచి చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ నాకు ఆయన్నుంచే అలవడింది. ఆయ‌న‌కు సినిమా మీద ఉన్న ప్యాషన్ వల్ల చాలా అగ్రెసివ్ గా ఉంటారు. సినిమా మీద  ప్రేమ లేక‌పోతే ఆయనలా ఉండరు. ‘ఒక విచిత్రం’ స‌రిగా ఆడ‌లేద‌ని తేజ గారిని త‌ప్పుప‌ట్ట‌లేను. నా తొలి సినిమా దర్శకుడాయన. అందుకే ఆయన్ని నా గురువుగా భావిస్తాను’’ అన్నాడు ఆది. తమిళంలో సరిగా ఆడని ‘మలుపు’ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం చాలా చాలా సంతోషాన్నిచ్చిందని.. ‘సరైనోడు’తో తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందని ఆది అన్నాడు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో తానో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయబోతున్నట్లు ఆది వెల్లడించాడు.
Tags:    

Similar News