పిచ్చోళ్లే ఇలాంటి సినిమాలు చేస్తారు!

Update: 2016-10-21 17:21 GMT
ఆమిర్ ఖాన్ తాజా చిత్రం "దంగల్"... ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమిర్ పై పొగడ్తల వర్షాలు కురుస్తున్నాయి, మరో పక్క యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ దుమ్ములేపేస్తోంది. ప్రముఖ రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాపై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి సినిమాను ఎంపిక చేసుకుని, ఈ వయసులో తనను తాను శారీరకంగా ఎంతో కష్టపెట్టుకున్నందుకు ఆమిర్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సమయంలో ఆమిర్ ఖాన్ ను "ఇడియట్" అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా.

ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా చేయడంపై స్పందించిన వినోద్ చోప్రా... "ఇలాంటి సినిమాలు పిచ్చోళ్లు మాత్రమే చేస్తారు.. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆమిర్ ఖాన్ ఒక ఇడియట్..." అని వ్యాఖ్యానించారు. అదేంటి... అంతా ఈ సినిమాను, ఆమిర్ ను పొగడ్తలతో ముంచేస్తుంటే ఈయనగారు ఇలా అంటున్నారు అనుకునేరు... ఇవి కూడా పొగడ్తలే! అవును... 51ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్‌ ఒక రెజ్లర్ పాత్రలో నటించడమంటే చిన్న విషయం కాదని, తనకు సినిమాలంటే పిచ్చి అని, అతడు "త్రీ ఇడియట్స్"లో చేసినప్పటి నుంచి తాము ముద్దుగా ఇడియట్ అని పిలుచుకుంటామని చెబుతున్నారు వినోద్ చోప్రా. జీవితంలో బాగా డబ్బు సంపాదించి అనంతరం మరణించినా మన గురించి ఎవరూ గుర్తుపెట్టుకోరు కనీ.. ఇలా ఒక ప్యాషన్‌ తో పనిచేస్తే మాత్రం ఎన్ని తరాలైనా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు, ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుగా దమ్ము ఉండాలని వినోద్ చోప్రా అభిప్రాయపడ్డారు.

కాగా, మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించారు. వాళ్లిద్దరూ రియో ఒలింపిక్స్‌ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ గతంలో నటించిన పీకే, 3 ఇడియట్స్ సినిమాలకు విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు, దాంతో ఈ సినిమాపై ఆమిర్ ను ఇలా ప్రశంసించారు. అలాగే, విడుదలయిన ఒక్కరోజులోనే ఈ "దంగల్" ట్రైలర్ కు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి.

Full View
Tags:    

Similar News