షారూఖ్‌ తప్పించుకున్నాడు.. కాని అమీర్‌..

Update: 2016-07-04 12:29 GMT
హిప్పోక్రసీ అనే పదానికి డిక్షనరిలో లేని ఎగ్జాంపుల్‌ అంటే అది బాలీవుడ్డే. ఎవరన్నా ఒక చిన్న రేంజు సెలబ్రిటీ ఏదన్నా ఒక వ్యాఖ్య చేశాడంటే.. దానిపై నానా రచ్చా చేస్తుంటారు అక్కడి స్టార్లూ స్టారీమణులు. కాని మొన్న సల్మాన్‌ ఖాన్‌ తనని తాను ఓ రేప్ విక్టిమ్‌ తో పోల్చుకుని సదరు బాధితులను అవమానించినా కూడా.. బాలీవుడ్ లో చీమ చిటుక్కుమనలేదు. ఎందుకంటే సల్మాన్‌ తో పెట్టుకుంటే అవకాశాలు చేజారిపోతాయ్‌ కాబట్టి.

మొన్ననే షారూఖ్‌ ఖాన్‌ ను ఇదే విషయమై స్పందించమంటే.. ఇతరుల వ్యాఖ్యలను మంచి చెడూ అంటూ తాను జడ్జి చేయలేనని తెలివిగా తప్పించుకున్నాడు. అయితే సల్మాన్‌ చేసిన వ్యాఖ్యలపై అతగాడి స్నేహితుడు అమీర్‌ ఖాన్‌ మాత్రం స్పందించాడు. ''ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో నేనక్కడ లేను.. మీడియా వార్తల ప్రకారం అయితే .. ఆ వ్యాఖ్యలు దురదృష్టకరం.. సదరు విక్టిమ్స్ ను అవమానపరచడమే. కాని ఈ విషయంలో నేను సల్మాన్‌ తో మాట్లాడలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు అమీర్‌. ఒకవేళ సల్మాన్‌ కు ఏమైనా సలహా ఇస్తారా? అని అడిగితే.. ''అందుకు నేనెవరు?'' అంటూ ఈ బాధ్యాతాయుతమైన సూపర్ స్టార్ సమాధానం చెప్పాడు.

అయ్యా అమీరూ.. అదే నలుగురు కుర్రాళ్ళు కలసి రోస్ట్ అంటూ కామెడీ చేస్తే మాత్రం.. వాళ్ళని తిట్టడమే కాదు.. అలాంటి పనులు చేయడం ఎందుకు అంటూ సలహాలు కూడా ఇచ్చావు. మరి అప్పుడు అనిపించలేదా నీకు ''నేను ఎవరు??'' అని?
Tags:    

Similar News