అమీర్ ఖాన్ మూవీ షూటింగ్ అమలాపురంలో అక్కడ చేశారట

Update: 2021-08-14 04:31 GMT
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అనూహ్యంగా ఏపీకి రావటం తెలిసిందే. తాను చేస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీ షూటింగ్ కోసం కాకినాడకు చేరుకున్న ఆయన.. గురువారం రోజంతా తాను బస చేసిన హోటల్ నుంచి బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మాత్రం ఆయన మూవీ షూటింగ్ షురూ చేయటంతో పాటు.. కొన్ని సీన్లు తీశారని చెబుతున్నారు

కాకినాడ నుంచి అమలాపురానికి దగ్గర్లోని అల్లవరం మండలం కోడూరు పాడు గ్రామంలో కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఈ ఊరి ప్రత్యేకత ఏమంటే.. గతంలో ఇదే ఊళ్లో జీవన జ్యోతి.. శివయ్య సినిమా షూటింగ్ లు చేశారు. తాజాగా.. ఇదే ఊళ్లో అమీర్ మూవీ సీన్లు ఇక్కడే చేయనున్నారు. ఒక పాతబడిన పెంకుటింట్లో షూటింగ్ సాగుతోంది. సినిమాలో ఆర్మీ అధికారి ఒకరు వీర మరణం పొందటం.. వారి కుటుంబాన్ని పరామర్శించటం కోసం సైనికాధికారి పాత్ర పోషిస్తున్న అమీర్ ఖాన్ అక్కడకు వచ్చి.. వారి కుటుంబాన్ని ఓదార్చే సీన్లను చిత్రీకరిస్తున్నారు.

ఇక్కడ షూటింగ్ పూర్తి అయ్యాక తర్వాతి సీన్లు ఓడరేవులో చిత్రీకరిస్తారని చెబుతున్నారు. బాలీవుడ్ సినిమాలు చేసే అమీర్ ఖాన్ కు తెలుగు నేల మీదా బోలెడంత ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతో అమీర్ షూటింగ్ జరుగుతుందన్న విషయం ప్రచార మాధ్యమాల్లో భారీగా ప్రచారం కావటంతో.. శుక్రవారం ఆయన మూవీ షూటింగ్ చేస్తున్న దగ్గరకు పెద్ద ఎత్తున అభిమాన గణం వచ్చే ప్రయత్నం చేశారు.

అలా వచ్చిన వారిని వచ్చినట్లుగా భద్రతా సిబ్బంది అడ్డుకొని వారిని తిప్పి పంపించినట్లుగా చెబుతున్నారు. దీంతో అభిమానుల్లో కూసింత నిరాశ ఎదురైందని చెబుతున్నారు. ఇదే సినిమాలో ఆర్మీ అధికారి బాలా పాత్రలో అక్కినేని నాగచైతన్య చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తంగా చూస్తే.. అమీర్ ఖాన్ కు తెలుగు నేల మీద ఉన్న ఇమేజ్ ఎంతన్న విషయం తాజా షూట్ పుణ్యమా అని ఇట్టే తెలిసి పోయిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News