'ఆచార్య‌' ఎఫెక్ట్‌.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అల‌జడి!?

Update: 2022-04-30 05:30 GMT
మెగా ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఆచార్య‌'. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించారు. గ‌త రెండేళ్ల నుంచీ మెగా అభిమానుల‌ను ఊరిస్తూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు నిన్న అట్ట‌హాసంగా విడుద‌ల అయింది.

అయితే మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కింది. తొలిసారి రామ్‌ చరణ్‌ పూర్తి స్థాయిలో చిరంజీవితో కలిసి నటించిన‌ సినిమా కావ‌డంతో.. ఆచార్య‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కానీ, ఆ అంచ‌నాల‌ను మాత్రం చిరు-చ‌ర‌ణ్ లు అందుకోలేక‌పోయార‌ని అంటున్నారు. కథలో కొత్తదనం లేక‌పోవ‌డం, కథనంలో ప్రేక్ష‌కులు కోరుకునే మ‌లుపులు, మెరుపులు లేక‌పోవ‌డంతో ఈ చిత్రంపై సినీ క్రిటిక్స్ మాత్ర‌మే కాదు సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం పెద‌వి విరుస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం ఎరుగని దర్శకుడిగా స‌త్తా చాటుతూ వ‌చ్చిన కొర‌టాల శివ‌.. ఆచార్య తో మొదటిసారి పరాజయాన్ని మూట కట్టుకున్నారు. అయితే ఆచార్య నెగ‌టివ్ టాక్ ఎఫెక్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అల‌జ‌డి మొద‌లైంది.

'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివతో ప్ర‌క‌టించాడు. 'ఎన్టీఆర్ 30' వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితం కానుంది.

ఇక ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న త‌రుణంలో.. 'ఆచార్య‌' టాక్ వారికి ఊహించ‌ని షాక్ త‌గిలేలా చేసింది. కొరటాల నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేదని చాలా మంది అంటున్నారు. దీంతో ఆయ‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన‌ 'ఎన్టీఆర్ 30' ఎలా ఉంటుందో అని అభిమానులు క‌ల‌వ‌రపాటుకు గ‌ర‌వుతున్నారు.

పైగా రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల త‌దుప‌రి చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌తాయి అనే బ్యాడ్ సెంటిమెంట్ చాలా కాలంగా వినిపిస్తుంది. ఈ సెంట‌మెంట్ ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏ హీరో బ్రేక్ చేయ‌లేక‌పోయాడు. దీని నుంచి ఆచార్య కూడా త‌ప్పించుకోలేక‌పోయింద‌ని అంటున్నారు. దీంతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ప్ర‌భావం 'ఎన్టీఆర్ 30'పై ఎక్క‌డ ప‌డుతుందో అని ఫ్యాన్స్ మ‌రింత భ‌య‌పడుతున్నారు.
Tags:    

Similar News