'ఆచార్య' కు యూఎస్ లో ఊహించని షాక్..!

Update: 2022-05-02 09:30 GMT
మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించడం లేదు. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. నాలుగో రోజే చేతులెత్తేసింది. ముఖ్యంగా ఓవర్ సీన్ ఈ సినిమా లెక్కలు చూసి టాలీవుడ్ అంతా షాక్ అవుతోంది.

'ఆచార్య' సినిమా యూఎస్ఏలో ప్రీమియర్స్ మరియు ఫస్ట్ డే కలిపి $817K కలెక్షన్స్ రాబట్టినట్లు నివేదికలు వచ్చాయి. ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలో భారీ డ్రాప్ కనిపించింది. ఇది రెండో రోజు శనివారం కూడా కొనసాగింది.

'ఆచార్య' చిత్రం యూఎస్ లో ఈ శనివారం కేవలం 87k డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండో రోజు కలెక్ట్ చేసిన 87,783 డాలర్లు కలిపి మొత్తం $905,132 కలెక్షన్స్ రాబట్టింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, మొదటి వారం రన్ పూర్తయ్యే నాటికి $1 మిలియన్ కు దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేయొచ్చు.

శనివారం రోజు 'ఆచార్య' సినిమా కేవలం 87k డాలర్లు మాత్రమే వసూలు చేస్తే.. ఆసక్తికరంగా అదే రోజు 'KGF 2' సినిమా 100k కంటే ఎక్కువ వసూలు చేసింది. మూడో వారంలో అడుగుపెట్టిన కన్నడ మూవీ మూడో శనివారం వసూళ్ళు.. కొత్త సినిమా మూడో రోజు కలెక్షన్స్ కంటే ఎక్కువ ఉండటం గమనార్హం.

ఈ లెక్కలను బట్టి యూఎస్ లో మెగా మూవీ డిజాస్టర్ దిశగా సాగుతోందని అర్థం అవుతుంది. ఇది మెగా హీరోలకే కాదు.. మొత్తం టాలీవుడ్ కు ఊహించని షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అమెరికాలో తెలుగు సినిమాలకు ఆదరణ బాగా ఉంటుంది.

కరోనా పాండమిక్ వల్ల దేశీయ మార్కెట్ మాదిరిగానే ఓవర్ సీస్ మార్కెట్ కూడా దెబ్బతినింది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు నార్మల్ అయ్యాయి. 'ఆర్.ఆర్.ఆర్' మూవీ ఓపెనింగ్ వీకెండ్ లోనే 9 మిలియన్లకు పైగా వసూళ్ళు రాబట్టగలిగింది. 'భీమ్లా నాయక్' కూడా ఫైనల్ రన్ లో పర్వాలేదనిపించింది.

అయితే ఇప్పుడు చిరంజీవి - రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసిన 'ఆచార్య' సినిమా మూడో రోజు 100K డాలర్లు కూడా రాబట్టలేకపోవడం ఆశ్చర్యకరమే. దర్శకుడు కొరటాల శివ గత చిత్రాలన్నీ యుఎస్ లో మంచి వసూళ్ళు అందుకున్నాయి. దీనికి తోడు RRR సినిమాతో చరణ్ మాంచి జోష్ లో ఉన్నారు.

అయినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా 'ఆచార్య' సినిమా అమెరికాలో దారుణమైన వసూళ్ళు అందుకుంటోంది. ప్రీమియర్స్ టాక్ మరియు రివ్యూల ఆధారంగా అక్కడ ఓపెనింగ్స్ ఉంటాయి. మెగా మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ సైతం పెద్దగా ఆసక్తి కనబరచలేదని తెలుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

కాగా, కొరటాల శివ దర్శకత్వంలో చిరు - చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమాలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించింది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. తిరు సినిమాటోగ్రఫీ అందించారు. కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Tags:    

Similar News