బాలీవుడ్ విలక్షణ నటుడు మృతి...!

Update: 2020-04-29 06:45 GMT
తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూశారు. ఇర్ఫాన్‌ అకస్మాత్తుగా బాత్ రూమ్ లో క్రిందపడి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌ లో చేర్పించారు. ఈరోజు కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో ICUలో చికిత్స పొందుతున్న 54 ఏళ్ళ ఇర్ఫాన్ ఖాన్ మరణించినట్లు అధికారికంగా వార్త వెలువడింది. ఇర్ఫాన్ ఖాన్ చాలా రోజుల క్రితమే న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అనే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన లండన్‌ లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌ లో తిరిగి ముంబై చేరుకున్నారు. భారత్‌ కు తిరిగి వచ్చిన తరువాత ఆ మధ్య మరోసారి తన ఆరోగ్యంపై స్పందించారు ఇర్ఫాన్. 'తాను పూర్తిగా కోలుకోలేదని.. ఇక ఇక్కడే ఉంటూ రెగ్యులర్ చెకప్ చేయించుకుంటున్నానని' చెప్పుకొచ్చాడు. అయితే అంతలోనే ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మధ్యే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం కూడా కన్నుమూసారు.

కరోనా లాక్‌ డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు ఇర్ఫాన్. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో కాల్ ద్వారా వీక్షించి ఎంతో బాధపడ్డాడు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌ లోకి వెళ్ళాడట. కాగా అప్పట్లోనే ఇర్ఫాన్ ఖాన్ నేను బతికేది కొన్ని రోజులే అంటూ అప్పట్లో ఓ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా తల్లి మరణంతో కృంగిపోయిన ఇర్ఫాన్‌ కు క్యాన్సర్ తిరగబెట్టినట్టు తెలుస్తోంది. ఇర్ఫాన్ ఖాన్ మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పొచ్చు. ఆయన మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది.  దేశవ్యాప్తంగా సినీరాజకీయ ప్రముఖులు - సినీ అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

‘సలామ్ బాంబే’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఇర్ఫాన్.. తన విలక్షణమైన నటనతో ఎన్నో జాతీయ అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన 'సైనికుడు' సినిమాలో నటించారు. రీసెంటుగా 'అంగ్రేజీ మీడియం' సినిమాలో నటించగా.. ఆ సినిమా లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు రిలీజయింది.


Tags:    

Similar News