సూపర్ స్టార్ కూతురిగా భలే ఛాన్స్ ?

Update: 2019-04-07 05:16 GMT
నిన్ను కోరిలో నానితో జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ తో మెప్పించిన నివేదా థామస్ కెరీర్ టాలీవుడ్ లో ఆశించిన వేగంతో వెళ్లడం లేదు. ఇటీవలే విడుదలైన 118లో తన మీదే కథ ఫోకస్ అయినప్పటికీ ట్రాజెడీ ఎండింగ్ ఉన్న పాత్ర కావడంతో తనకు దక్కిన ప్రయోజనం తక్కువే. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నివేదా థామస్ మలయాళంలో సైతం ఏమంత గొప్ప ఆఫర్లు దక్కించుకోవడం లేదు.

ఇదిలా ఉండగా చెన్నై టాక్ ప్రకారం నివేదాకు ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న సినిమాలో ఆయన కూతురిగా నటించేందుకు ప్రతిపాదన వచ్చినట్టుగా సమాచారం. తను ఒప్పుకుందా లేక హోల్డ్ లో పెట్టిందా అనేది ఇంకా ఖరారు కాలేదు కానీ ఇదైతే మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజని నటిస్తున్న ఈ మూవీలో డ్యూయల్ రోల్ ఉండొచ్చనే టాక్ ముందు నుంచి ఉంది. ఇప్పుడు నివేదా లాంటి వయసున్న కూతురు అంటే రజని పాత్ర ఏజ్ బార్ అనే క్లారిటీ వచ్చినట్టే. వయసులో ఉన్న ఇంకో రజనిగా డబుల్ ఫోటో ఉంటుందా లేక నాయకుడులో కమల్ హాసన్ తరహాలో సినిమా ముందుకెళ్లే కొద్దీ వయసుమళ్లేలా ఉంటుందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

నయనతార రజనికి జంటగా ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు నివేదాకు వచ్చిన పాత్ర కూడా ముందు కీర్తి సురేష్ కు వెళ్ళింది. తను నో చెప్పడంతో ఇప్పుడు బాల్ నివేదా వద్దకు వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఉంది. దృశ్యం తమిళ్ వెర్షన్ పాపనాశంలో కమల్ హాసన్ కూతురిగా నివేదా నటించింది. ఇప్పుడు ఇది ఓకే అయితే ఇద్దరు తమిళ దిగ్గజాలకు కూతురిగా నటించిన అరుదైన ఘనత తనకు దక్కుతుంది.
    
    
    

Tags:    

Similar News