శ్రీరెడ్డి వ్యాఖ్యలపై విభేదించిన స్వాతి

Update: 2018-07-08 05:28 GMT
తెలుగమ్మాయిలపై టాలీవుడ్ దర్శక నిర్మాతలు వివక్ష చూపిస్తారన్నది ఎప్పట్నుంచో ఉన్న ఆరోపణ. మన దగ్గరే ఎంతోమంది టాలెంటెడ్ హీరోయిన్లున్నా పట్టించుకోరని.. పొరుగు భాషల వాళ్లు మన హీరోయిన్లను ఆదరించినట్లుగా.. ఇక్కడి వాళ్లు ప్రోత్సహించరని విమర్శలున్నాయి. ఇదే విషయమై శ్రీరెడ్డి కూడా గళం విప్పింది. తెలుగులో తెలుగు అమ్మాయిలకు అవకాశాలివ్వకపోవడంపై విరుచుకుపడింది. దీంతో పాటుగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని కూడా తెరమీదికి తెచ్చింది. శ్రీరెడ్డి కంటే ముందు.. తర్వాత కూడా కొందరు తెలుగు ఆర్టిస్టులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కకపోవడంపై గళం విప్పారు. ఐతే ఈ విషయంలో మరీ రభస చేయాల్సిన అవసరం లేదని అంటోంది తెలుగు హీరోయిన్ స్వాతి.

ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కని హీరోయిన్లలో స్వాతి కూడా ఒకరు. అలాగని ఆమె ఈ విషయంలో ఎవరి మీదా విమర్శలు చేయడం లేదు. శ్రీరెడ్డి అండ్ కో వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా మాట్లాడింది స్వాతి. తెలుగులో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు దక్కకపోవడంపై ఆమె స్పందిస్తూ.. ‘‘నాకిది క్యాస్ట్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంటుంది. నేను బ్రాహ్మిణ్.. నేను చౌదరి.. లేదా ఇంకో క్యాస్ట్. మీరు కూడా అదే క్యాస్ట్ కాబట్టి నన్ను తీసుకోండి అని అడిగినట్లుగా ఉంటుందిది. అవకాశాల కోసం డిమాండ్ చేసేవాళ్ల ఫ్రస్టేషన్ నాకర్థమవుతుంది. కానీ అది ప్రాక్టికల్ గా వర్కవుట్ కాదు. సినిమా అనేది సీరియస్ బిజినెస్. నిర్మాతలు పెట్టిన డబ్బులు వెనక్కి రావాలని ఆశిస్తారు. వాళ్లు నువ్వు తెలుగమ్మాయివా.. మంచి అమ్మాయివా అని చూసి అవకాశాలు ఇవ్వరు. ఒక పాత్ర తెలుగమ్మాయి మాత్రమే చేయగలదు.. తెలుగమ్మాయి అయితేనే న్యాయం చేస్తుందని అంటే వేరే విషయం. ప్రతి సినిమాలోనూ తెలుగమ్మాయికే అవకాశం ఇవ్వాలని అనడం సరి కాదు’’ అని తేల్చి చెప్పింది స్వాతి. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి స్వాతి స్పందిస్తూ తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదు కాబట్టి దీనిపై ఏమీ మాట్లాడలేనని చెప్పేసింది.
Tags:    

Similar News