కొరియోగ్రాఫ‌ర్ పై అలిగి మాట్లాడ్డం మానేసిన న‌టి!

Update: 2020-05-09 04:30 GMT
ఒక్కోసారి అసూయ ఊహించ‌ని విధంగా కొంప‌లు ముంచేస్తుంది. దాని ప్ర‌భావంతో మంచి స్నేహితుల్ని దూరం చేసుకోవాల్సి వ‌స్తుంది. ఆ అసూయ వ‌ల్ల‌నే ఆ కొరియోగ్రాఫ‌ర్ తో స‌ద‌రు సీనియ‌ర్ న‌టి స్నేహం చెడింది. ఏడాది పాటు మాట్లాడుకోవ‌డ‌మే మానేశారు. ఆ త‌ర్వాత తిరిగి పాత స్నేహితుల్లాగా బాగానే క‌లిసిపోయ‌రు కానీ.. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో కొరియోగ్రాఫ‌ర్ ఎవ‌రు?  న‌టి ఎవ‌రు? అంటే.. కొరియోగ్రాఫ‌ర్ పేరు స‌రోజ్ ఖాన్. న‌టి పేరు శ్రీ‌దేవి.

నా సాటి న‌టికి చ‌క్క‌ని కొరియోగ్ర‌ఫీ అందించి నాకు మాత్రం చెత్త డ్యాన్సులు నేర్పిస్తావా? అంటూ అసూయను బ‌య‌ట‌పెట్టారు శ్రీ‌దేవి. కోపాన్ని అణ‌చుకోలేక ముఖంపైనే అనేయ‌డంతో స‌రోజ్ ఖాన్ తీవ్రంగా అలిగారు. అప్ప‌టివ‌ర‌కూ ఉన్న స్నేహాన్ని క‌ట్ చేసుకుని త‌న‌తో మాట్లాడ‌డం మానేశార‌ట‌. ఇదే విష‌యాన్ని లేడీ కొరియోగ్రాఫ‌ర్ స‌రోజ్ ఖాన్ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

అప్ప‌టివ‌ర‌కూ శ్రీదేవి- సరోజ్ ఖాన్ గొప్ప స్నేహితులు. ఎన్నో సినిమాల‌కు క‌లిసి ప‌ని చేశారు. మిస్టర్ బెచారా- జుదాయి- ఖుదా గవా- నాగిన్‌- మిస్టర్ ఇండియా-చాందిని- లామ్హే లాంటి క్లాసిక్ హిట్ చిత్రాల‌కు ఈ జోడీ క‌లిసి ని చేశారు. వారిద్దరు ఒకరితో ఒకరు మంచి అనుబంధాన్ని కొన‌సాగించ‌డ‌మే కాక గొప్ప స్నేహితులు అయ్యారు. నాగిన్‌ చిత్రం షూటింగ్ సమయంలో వారి బంధం మరింత బలపడింది. అటుపై కొన్ని సంఘటనలు వారి స్నేహాన్ని దెబ్బ తీశాయి.

ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పెద్ద ఫైట్ జ‌రిగింది అప్ప‌ట్లో. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడటం మానేశారు. కలిసి పనిచేయడం కూడా మానేశారు. దాదాపు ఒక సంవత్సరం పాటు మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్. దానికి కార‌ణం.. `మిస్టర్ ఇండియా`లో  శ్రీదేవి ఐకానిక్ సాంగ్ `హవా హవాయి...` అని ఆ త‌ర్వాత తెలిసింది. ఆ సినిమా విడుద‌లైన ఏడాదికి విడుదలైన `తేజాబ్`లో మాధురి దీక్షిత్ పాట `ఏక్ దో తీన్ ..` సూపర్ హిట్ అయ్యింది.

ఈ పాట చూసిన శ్రీదేవి స‌రోజ్ పై ఫైర‌య్యారు‌. తన కంటే మాధురి దీక్షిత్ కు మంచి డ్యాన్స్ స్టెప్స్ నేర్పించార‌ని ఆరోపించారు. శ్రీదేవి మాటలు కొరియోగ్రాఫర్ స‌రోజ్ ‌ను తీవ్రంగా బాధించాయి. దాంతో వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవ‌టం మానేశారు. అటుపై ఏడాది తరువాత.. అనిల్ కపూర్ సినిమాల్లో ఒక పాటకు స‌రోజ్ ఖాన్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆ పాట‌ను శ్రీదేవి కూడా చూశారు. తరువాత సరోజ్ ఖాన్ తో క‌లిసిపోయి మాట్లాడారు. అటుపై వారిద్దరూ ఒకరితో ఒకరు స్నేహం కొన‌సాగించారు. అదీ సంగ‌తి.
Tags:    

Similar News