ప్లాస్టిక్ నిషేధంపై అడివి శేష్ ప్ర‌చారం

Update: 2019-11-04 14:25 GMT
5.6 మిలియ‌న్ ట‌న్స్ ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఇప్ప‌టికే భూమిపై వెలువ‌డ్డాయి. మునుముందు ఇది అమాంతం ప‌దింత‌లు కానుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ఇండియాలో ప్లాస్టిక్ వినియోగం మ‌రీ పెచ్చుమీరిన‌ స్థాయిలో ఉంది. దీనికి సంబంధించిన ప‌ర్య‌వ‌సానాల్ని వివ‌రిస్తూ `ఏ ప్లాస్టిక్ వేవ్` పేరుతో డాక్యుమెంట‌రీ రూపొందింది. అందుకు సంబంధించిన వీడియోని అడివి శేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా రివీల్ చేశారు. ఈ వీడియోలో ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తులు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం ఈ వీడియోకి శేష్ అభిమానుల నుంచి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్లాస్టిక్ నిషేధంలో తాము కూడా చేతులు క‌లుపుతామ‌ని ప్రామిస్ చేశారు కొంద‌రైతే. యువ‌హీరోలు సామాజిక జిజ్ఞాస‌ను క‌లిగి ఉండ‌డం భ‌విష్య‌త్ విష‌యంలో ముందు చూపుతో ఉండ‌డం హ‌ర్షించ‌ద‌గిన‌దే. ఈ త‌ర‌హాలో ఇత‌ర హీరోలు ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం.. ప్లాస్టిక్ వినియోగం .. ప్ర‌కృతి విప‌త్తులు వంటి వాటిపై విస్త్ర‌తంగా ప్ర‌చారం చేయ‌డం ఆహ్వానించ‌ద‌గిన‌దే.

అన్న‌ట్టు శేష్ అభిమానులు ప్ర‌స్తుతం అత‌డు న‌టించ‌నున్న పాన్ ఇండియా సినిమా గురించి ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్నించారు. `మేజ‌ర్` అంటూ ఇంత‌కుముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మాత‌గా ఓ సినిమాని ప్ర‌క‌టించారు. 26/11 ఉగ్ర‌దాడుల్లో తీవ్రవాదుల‌కు ఎదురెళ్లి ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడిన ఎన్.ఎస్.జీ క‌మెండో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో శేష్ న‌టించ‌నున్నారు. స‌ముద్ర మార్గం గుండా ర‌హ‌స్యంగా దేశంలో ప్ర‌వేశించిన పాక్ ముష్క‌ర తీవ్ర‌వాదులు ముంబై తాజ్ హోట‌ల్.. ఛ‌త్రప‌తి టెర్మిన‌ల్ స‌హా ప‌లు చోట్ల దారుణ మార‌ణ‌కాండ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘోర‌మైన ఎటాక్ నుంచి కొంద‌రిని కాపాడేందుకు సందీప్ ఉన్నికృష్ణ‌న్ చూపించిన ధైర్య సాహ‌సాలు ఎంతో గొప్ప‌వి. ఈ మార‌ణ హోమంలో ఆయ‌న ప్రాణాల్ని కోల్పోయి అమ‌ర‌వీరుడ‌య్యారు. అత‌డి మ‌ర‌ణానంత‌రం భార‌త ప్ర‌భుత్వం అశోక చ‌క్ర బిరుదుని ఇచ్చి గౌర‌వించింది. అందుకే అలాంటి సాహ‌సి క‌థ‌లో శేష్ న‌టిస్తున్నారు అన‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది.  అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడు? ఇత‌ర‌త్రా సంగ‌తులేమిటి? అన్న‌ది వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News