ఆ‘క్ష‌ణం’ ప్రాణం పోయినంత పనైందిః హీరో

Update: 2021-07-15 02:30 GMT
సినిమా అంటే బిజినెస్. షూటింగ్ మొదలు పెట్టే ముందు కొట్టే కొబ్బరికాయ మొదలు ఆఖ‌ర్లో కొట్టే గుమ్మ‌డికాయ దాకా.. ప్ర‌తిదీ పైసాతోనే లెక్క‌. అందుకే.. నిర్మాత‌లు ఆచితూచి అడుగేస్తారు. అన్ని క‌థ‌ల‌నూ న‌మ్మే సినిమా తీస్తారు. కానీ.. అందులో స‌క్సెస్ అయ్యేవి మాత్రం అత్య‌ల్పం. కాబ‌ట్టి.. మొద‌లు పెట్ట‌డానికి ముందే .. ఒక‌టికి వెయ్యిసార్లు ఆలోచిస్తారు. అందులో త‌ప్పు లేదు కూడా.

టాలెంటెడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌చ‌యిత అడ‌వి శేషు తీసిన 'క్ష‌ణం' సినిమా ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిందే. అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నంతో సాగే ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ను చూసిన‌వారంతా ఫిదా అయిపోయారు. కేవ‌లం కోటి రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. ప‌ది కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించింది. అయితే.. ఈ సినిమా అంత ఈజీగా ఏమీ తెర‌కెక్క‌లేదు. ఆ మాట‌కొస్తే.. అస‌లు సినిమా మొద‌లు కాదేమో అని కూడా అనుకున్నాడ‌ట అడివి శేషు.

ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యాన‌ర్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. అయితే.. పీవీపీకి క‌థ వినిపించ‌డానికి వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న‌తోపాటు మ‌రికొంద‌రు కూడా ఉన్నార‌ట‌. కథ మొత్తం వినేసిన త‌ర్వాత ఎవ‌రి అభిప్రాయం వారు చెప్పార‌ట‌. కొన్ని కొన్ని చోట్ల మారిస్తే బాగుంటుంద‌ని చెబుతున్నార‌ట‌. కానీ.. అందులోని ఒక‌రైతే.. అస‌లు ఈ స్క్రిప్టే బాగోలేద‌ని చెప్పేశార‌ట‌. మొత్తం మార్చేయాల్సిందేనని అన్నార‌ట‌.

దీంతో.. ఫ్యూజులు ఎగిరిపోయాయి అడివి శేషుకు! దాదాపు ఏడెనిమిది నెల‌లు కష్ట‌ప‌డి త‌యారు చేసుకున్న స్క్రిప్ట్ ఎందుకూ ప‌నిరాన‌ట్టేనా? అని ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. పీవీపీ సైతం ఈ సినిమా అవ‌స‌ర‌మా? అన్న‌ట్టుగానే చూశార‌ట‌. కానీ.. అక్క‌డే ఉన్న నిరంజ‌న్ రెడ్డితో క‌లిసి ప‌క్క గ‌దిలోకి వెళ్లి వ‌చ్చిన పీవీపీ.. ఈ సినిమా చేస్తున్నామ‌ని చెప్ప‌డంతో.. ప్రాణం తిరిగివ‌చ్చిన‌ట్టుగా అనిపించింది అన్నాడు అడివి శేషు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విష‌యాలు వెల్ల‌డించాడు శేషు.
Tags:    

Similar News