'ఆహా' మాస్ట‌ర్ ప్లాన్ అదిరింది

Update: 2021-12-08 03:30 GMT
లాక్ డౌన్ కార‌ణంగా సినీ అభిమానుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఏకైక సాధ‌నం ఓటీటీ. ఇక ఓటీటీ పుణ్య‌మా అని అర‌చేతిలోకి సినిమా వ‌చ్చి చేర‌డంతో దీనికి కోట్లల్లో ప్రేక్ష‌కులు అల‌వాటు ప‌డిపోయారు. థియేట‌ర్ కి వెళ్లి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సినిమాలు చూడాలంటే ఇంకా భ‌య‌ప‌డుతున్న జ‌నం ఓటీటీల‌కు ఎట్రాక్ట్ అవుతున్నారు. అందులోనే త‌మ‌కు న‌చ్చిన సినిమాల‌ని చూసేస్తున్నారు. దీంతో గ‌త కొంత కాలంగా బాలీవుడ్‌ కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఓటీటీ సంస్కృతి ద‌క్షిణాదిలోనూ వేళ్లూనుకోవ‌డం మొద‌లుపెట్టింది.

ఈ ప‌రిస్థితిని ప‌సిగట్టిన మాస్టార్ మైండ్.. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ..మై హోమ్స్ రామేశ్వ‌ర్‌రావుతో క‌లిసి `ఆహా` పేరుతో మొట్ట‌మొద‌టి తెలుగు డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌ని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా క్ర‌మంగా కుదురుకుంటూ త‌న స‌త్తాని చాటుకుంటూ ఉత్త‌రాది ఓటీటీ దిగ్గ‌జాల‌కు గ‌ట్టి పోటీనిస్తోంది. తెలుగులో మొట్ట‌మొద‌టి ఓటీటీ దిగ్గ‌జంగా `ఆహా` త‌న మార్కెట్‌ని సుస్థిరం చేసుకుంటోంది.

క‌ల‌ర్ ఫొటో, క్రాక్, ల‌వ్ స్టోరీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌తో ఫామ్‌లోకి వ‌చ్చిన ఆహా అదే స్థాయిలో రియాలిటీ షోల‌ని అందిస్తూ స‌రికొత్త ఒర‌వ‌డికి శ్రీ‌కారం చుట్టింది. తాజాగా నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌తో `అన్ స్టాప‌బుల్ ` పేరుతో ఓ సెల‌బ్రిటీ టాక్ షోని తెర‌పైకి తీసుకురావ‌డం అది అఖండ‌మైన పాపులారిటీని సొంతం చేసుకోవ‌డం తెలిసిందే. సినిమాలు, టాక్ షోలు , వెబ్‌సిరీస్‌ల‌తో టాప్‌లో నిలిచిన ఆహా ఇదే ఉత్సాహంతో ఇప్పుడు త‌న మార్కెట్‌ని విస్తృతం చేసే ప‌నిలో ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

కంప‌నీని విస్తృతం చేస్తూ త్వ‌ర‌లో అన్ని మార్కెట్ ల‌లోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇచ్చిన త‌న కార్య‌క‌లాపాల్ని.. మార్కెట్ ప‌రిథిని పెంచుకోవాల‌ని స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిసింది. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా `ఆహా` మాస్ట‌ర్ ప్లాన్ అదిరింద‌ని ఓహో అనిపించే ప్లాన్ తో `ఆహా` రంగంలోకి దిగుతోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News