మిస్టర్ మజ్ను.. క్లారిటీ ఇచ్చేశాడు

Update: 2018-11-28 08:34 GMT
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. తొలి రెండు సినిమాలు ‘అఖిల్’.. ‘హలో’ డిజాస్టర్లయిన నేపథ్యంలో అతడి కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకంగా మారింది. ఇది హిట్టవకుంటే అఖిల్ కెరీర్ ప్రమాదంలో పడుతుంది. ‘తొలి ప్రేమ’ లాంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరితో అఖిల్ ఈ సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొన్ని రోజులుగా సందిగ్ధత నడుస్తోంది.

దీనికి తెరదించే ప్రయత్నం చేశాడు అఖిల్. షూటింగ్ అప్ డేట్ తో పాటు రిలీజ్ డేట్ విషయంలోనూ అతను క్లారిటీ ఇచ్చాడు ఈ రోజు ఉదయం. ‘మిస్టర్ మజ్ను’ టాకీ పార్ట్ పూర్తి చేసే పనిలోనే ఉన్నామని.. డిసెంబరు 3కల్లా ఆ పని పూర్తవుతుందని అఖిల్ చెప్పాడు. దాని తర్వాత ఒక సెట్ సాంగ్ మాత్రమే తీయాల్సి ఉందని.. అంతకుమించి షూటింగ్ పార్ట్ ఏమీ లేదని అన్నాడు. అలాగే ఈ చిత్రాన్ని జనవరిలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా చెప్పాడు అఖిల్.

సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు ఫుల్ అయిపోయాయి కాబట్టి ఆ సీజన్లో ‘మిస్టర్ మజ్ను’ రాకపోవచ్చు. బహుశా జనవరి చివరి వారంలోనే ఈ చిత్రం రిలీజయ్యే అవకాశాలున్నాయి. ‘యన్.టి.ఆర్: మహా నాయకుడు’ విషయంలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో రిపబ్లిక్ డే వీకెండ్లోనే సినిమాను రిలీజ్ చేసేందుకు అవకాశముంది. లేదంటే ముందు వారంలో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చినా తేవచ్చు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.


Tags:    

Similar News