రైతుల పట్ల దాతృత్వాన్ని చాటుకున్న అక్కినేని అమల...!

Update: 2020-06-13 16:41 GMT
కష్ట సమయాలలో తమకు తోచిన విధంగా సహాయం చేయడానికి అక్కినేని ఫ్యామిలీ ముందుంటుంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆడుకోడానికి అక్కినేని నాగార్జున 'కరోనా క్రైసిస్ ఛారిటీ'కి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే తనయుడు నాగచైతన్య కూడా సీసీసీ కి మరియు పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళం అందించి మంచి మనసు చాటుకున్నాడు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో పనిచేసే కార్మికులకు కూడా అండగా ఉన్నారు. ఈ క్రమంలో నాగార్జున సతీమణి అక్కినేని అమల రైతుల పట్ల నిజమైన దాతృత్వాన్ని చాటుకున్నారు. బ్లూ క్రాస్‌ హైదరాబాద్‌ కో ఫౌండర్‌ గా ఉన్న అమల సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి తన వంతుగా రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామంలో 650 మంది రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున ఒక ఎకరానికి సరిపడేలా కంది విత్తనాలను అందజేశారు.

ఈ సందర్భంగా అక్కినేని అమల మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంపై అపోహలను పక్కనబెట్టి అనుభవాలను కలిసి పంచుకుంటే మార్పు వస్తుందని.. సేంద్రీయ వ్యవసాయంపై ఆసక్తి ఉంటే నిపుణులు, శాస్త్రవేత్తలను రప్పించి ఇక్కడ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రసాయనిక ఎరువులు, పురుగుల మందులను వాడకుండా పంటల సాగు చేసే వ్యవసాయ పద్ధతులు అనేకం ఉన్నాయని.. రైతులు వాటిని పాటిస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అక్కినేని అమల సూచించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో షేర్ చేసిన అమల ''నాగార్జున మరియు నేను ఈ రోజు 650 మంది రైతులకు కంది విత్తనాల పంపిణీ చేసాము. ప్రతి కుటుంబానికి ఒక ఎకరం భూమికి సరిపడా విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఋతుపవనాల ప్రారంభమై నాట్లు వేసే కాలం కావడంతో కరోనా వలన ఎదురుదెబ్బ తిన్న రైతులకు మద్దతు ఇవ్వడం కోసం దీనికి పూనుకున్నాం'' అని ట్వీట్ చేసింది. రైతులకు అండగా ఉండటానికి ముందుకొచ్చినందుకు నెటిజన్స్ అమలను ప్రశంసిస్తున్నారు.
Tags:    

Similar News