సూపర్ స్టార్ తో తన్నులు తినడం సూపర్

Update: 2016-02-01 11:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ దగ్గర తన్నులు తినడం కంటే అదృష్టమేముంది అని అడుగుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. రజినీ హీరోగా తెరకెక్కుతున్న ‘రోబో-2’లో విలన్ పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అక్షయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రోబో-2లో తనకు విలన్ పాత్ర దక్కడంపై, రజినీకాంత్ తో స్క్రీన్ పంచుకోబోతుండటంపై ఇప్పటికే చాలాసార్లు ఎగ్జైట్ అయిన అక్షయ్.. షూటింగ్ లో కూడా అడుగుపెట్టేయడంతో మరింత ఉద్వేగానికి లోనవుతున్నాడు.

‘‘నాకు ప్రపంచ శిఖరంపై ఉన్నట్లుంది. ఇప్పటికే నాకు సూపర్ స్టార్ పంచ్ లు, తన్నులు మొదలయ్యాయి. నేను కెరీర్ అంతా ఇదే పని చేశా. అందరినీ కొట్టా. కానీ నాకు సూపర్ స్టార్ లాంటి వాడు పంచ్ లు ఇవ్వడం గొప్పగా అనిపిస్తోంది. నెగెటివ్ రోల్ ఎప్పుడు చేస్తానా అని ఎదురు చూశా. రజినీ సినిమాలో అలాంటి పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. దీన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా’’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు అక్షయ్.

రోబో-2 కోసం తాను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు వచ్చిన వార్తల్ని అక్షయ్ ఖండించాడు. రజినీని తొలిసారి కలిసిన అనుభవం గురించి గుర్తు చేసుకుంటూ.. ‘‘దాదాపు 15 మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నారప్పుడు. అందరూ ఆయన్నే చూస్తున్నారు. టీ తాగుతూ తన ప్యాంటుపై పడ్డ దుమ్మును దులుపుకుంటూ కనిపించారు. అందరిలోనూ ఓ ఆత్రుత కనిపించిది. ఐతే అదే దుమ్ము నేను తుడుచుకుంటుంటే నన్నెవరూ పట్టించుకోలేదు’’ అని చెప్పాడు అక్షయ్.
Tags:    

Similar News