రజనీ తుస్.. అక్షయ్ భేష్

Update: 2018-12-03 14:30 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వచ్చిందంటే టాక్ తో సంబంధం లేకుండా తమిళనాట వసూళ్ల మోత మోగుతుంటుంది. కానీ ఆశ్చర్యకరంగా ‘2.0’కు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టలేకపోతోంది. ముఖ్యంగా తమిళనాటే ఈ చిత్రం అండర్ పెర్ఫామ్ చేస్తుండటం షాకింగ్ గా అనిపిస్తోంది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో తమిళనాట రూ.31 కోట్ల షేర్.. రూ.55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రజనీ స్థాయికి తగ్గ వసూళ్లు కావివి. గత నెలలో విడుదలైన విజయ్ సినిమా తొలి వారాంతంలో ఇంతకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఆ చిత్రం తొలి రోజే రూ.32 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఆ మొత్తాన్ని మూడో రోజుకు కానీ టచ్ లేకపోయింది ‘2.0’. విజయ్ తో పోలిస్తే రజనీ రేంజ్ ఎక్కువ. పైగా ఆయన శంకర్ తో జత కట్టాడు. ‘రోబో’కు సీక్వెల్ అయిన ‘2.0’తో వచ్చాడు. అలాంటి సినిమాకు ఈ వసూళ్లేంటో అర్థం కావడం లేదు.

‘2.0’కు తమిళంలో వస్తున్న వసూళ్లు చూసి సూపర్ స్టార్ ప్రభ తగ్గిపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘2.0’ తెలుగులో ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. ఐతే తమిళం.. తెలుగుతో పోలిస్తే ఈ చిత్రం హిందీలో భారీ వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు హిందీలో రూ.19.5 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిన ‘2.0’ రెండో రోజు రూ.17.5 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు వసూళ్లు రూ.24 కోట్లు కాగా.. నాలుగో రోజైన ఆదివారం ఏకంగా రూ.34 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తంగా ఈ చిత్ర వసూళ్లు హిందీలో రూ.95 కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అక్షయ్ కుమార్ అని భావించవచ్చు. ‘2.0’ను రజనీ-శంకర్ సినిమాలా కాకుండా అక్షయ్ మూవీగా భావిస్తున్నారేమో అక్కడి ప్రేక్షకులు. తన టెరిటరీలో అక్షయ్ బాగానే సత్తా చాటుతున్నాడు. ఓవైపు రజనీ ఇక్కడ నిరాశ పరుస్తుంటే ఉత్తరాదిన మాత్రం అక్షయ్ అదరగొట్టేస్తున్నాడనే చెప్పాలి.


Tags:    

Similar News