కూతురు పుట్టాక ఆలియా ట్రెండీ లుక్

Update: 2022-12-31 03:56 GMT
మాతృత్వం అనేది అంద‌మైన అనుభూతి. శిశువు పిండ ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టి నుంచి పొత్తి కడుపు నొప్పులు మొద‌ల‌య్యే వ‌ర‌కూ వివిధ ద‌శ‌ల‌ను అమ్మ ఆనందంగా అనుభ‌విస్తుంది. నొప్పుల‌ను కూడా ఒక అనుభ‌వంగా భావించి భ‌రిస్తుంది. అలాంటి అనుభ‌వాల‌ను ఇప్ప‌టికే ప‌లువురు క‌థానాయిక‌లు మీడియాకు ప్ర‌తి ద‌శ‌ను షేర్ చేశారు. గ‌ర్భ‌స్థ ద‌శ‌లో తాము ఎదుర్కొన్న అనుభూతుల స‌మాహారంపై కొంద‌రు న‌టీమ‌ణులు పుస్త‌కాలే రాసారు. అంత‌గా అనుభూతి చెందే మ‌రొక సంద‌ర్భం జీవితంలో ఉండ‌దు.

ప‌లువురు క‌థానాయిక‌లు బేబి బంప్ ఫోటోషూట్ల‌ను ఆవిష్క‌రించారు. ఇటీవ‌ల ఆలియా భ‌ట్ కూడా త‌న బేబి బంప్ ఫోటోల‌తో ఇంట‌ర్నెట్ లో ద‌ర్శ‌నమిచ్చింది. ఇంత‌లోనే ఒక అంద‌మైన కుమార్తెకు స్వాగ‌తం ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రిస్మ‌స్ వేడుక‌ల‌ను ర‌ణ‌వీర్-ఆలియా జంట త‌మ కుమార్తెతో క‌లిసి జ‌రుపుకున్నారు.

ఆలియా భట్ శుక్రవారం సాయంత్రం తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో అద్భుతమైన ఫోటోలను షేర్ చేసారు. గత రాత్రి(శుక్ర‌వారం) భర్త రణబీర్ కపూర్ తో కలిసి ముంబైలో జరిగిన అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ ఎంగేజ్ మెంట్ పార్టీకి హాజరైన ఆలియా ఈవెంట్ లో రంగులరాట్నంలా మురిపించే ఒక‌ పోస్ట్ ను షేర్ చేసింది. రితికా మిర్చందానీ షెల్ఫ్ ల నుండి ఆక్వా బ్లూ కుర్తా ధరించి ఆలియా భ‌ట్ ఈ పార్టీకి హాజ‌ర‌య్యారు. అలియా భట్ తన పోస్ట్ కి స్నోఫ్లేక్ ఎమోజిని జోడించింది. ఈవెంట్ కోసం తన మేకప్ ను సంద‌ర్భానుసారం మినిమ‌ల్ గా తీర్చిదిద్దింది.

ఇటీవల త‌న ఇన్ స్టాగ్రామ్ లో ప్రసవానంతరం ఏం జ‌రుగుతుంది? అనే టాపిక్ గురించి ఆలియా ఔత్సాహికంగా మాట్లాడ‌డం ప్రారంభించింది. గ‌ర్భిణి స్త్రీ శరీరం సానుకూలతపై ఒక పోస్ట్ ను రాసింది. ఇందులో ఒక పోస్ట్ సారాంశం ఇలా ఉంది. "ఈ సంవత్సరం నా రూపం ఎలా మారుతుందో కానీ.. నేను మళ్ళీ నా పాత రూపం గురించి ఎప్పుడూ కష్టపడకూడదని ప్రతిజ్ఞ చేసాను" అని తెలిపింది. త‌న‌ భర్త రణబీర్ కపూర్ తో ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలను ఎలా జరుపుకుందో ఆవిష్క‌రించే ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. ఈ సంవత్సరంలో అత్యుత్తమ సమయం .. ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తులతో.. గ‌డిపాను అంటూ ఆనందం వ్య‌క్తం చేసింది. అంద‌రికీ మెర్రీ క్రిస్మ‌స్ అంటూ శుభాకాంక్ష‌లు తెలిపింది.

అలియా - రణబీర్ 2022 ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. ఈ జంట బాలీవుడ్ నుండి సన్నిహితులు బంధుమిత్రుల స‌మ‌క్షంలో పెళ్లాడారు. వారి తల్లులు నీతూ కపూర్- సోనీ రజ్దాన్ సహా ఇరు కుటుంబ సభ్యులతో సన్నిహిత వేడుకతో సంద‌డి చేసారు. నవంబర్ 6న తమ కుమార్తె జ‌న్మించింద‌ని అలియా తెలిపారు. "మా జీవితంలోని ఉత్తమ వార్తలలో ఒక‌టి ఇది. మా పాప జ‌న‌నం.. ఏమిటీ మాయ. త‌ల్లిదండ్రుల‌య్యాం. మీ ఆశీస్సులు కావాలి" అని ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించింది.

అలియా భట్ కి 2022 వృత్తిపరంగా అద్భుతమైన సంవత్సరం. కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  గంగూబాయి కతియావాడి- డార్లింగ్స్- బ్రహ్మాస్త్ర వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాల తర్వాత అలియా హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర నాయిక‌గా ఓ వెలుగు వెలుగుతోంది.  నెట్ ఫ్లిక్స్ లో విడుదలై సానుకూల సమీక్షలను అందుకున్న డార్లింగ్స్ కి సహ-నిర్మాతగా కొన‌సాగింది. ఇలాంటి స‌మ‌యంలో త‌న జీవితంలోకి వ‌రుస‌గా ఆనంద క్ష‌ణాలు వెల్లువ‌లా వెంట వ‌స్తున్నాయి.

హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో ఈ బ్యూటీ హాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రంలో వండ‌ర్ ఉమెన్ గాల్ గాడోట్ తో కలిసి నటించింది. ఇదే కాకుండా వరుసలో అనేక సినిమాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News