అల్లరి నరేష్ కన్నీటి ఉత్తరం కథ

Update: 2016-12-06 09:18 GMT
అల్లరి నరేష్ ఏంటి.. కన్నీటి ఉత్తరం ఏంటి అంటారా..? ఇది దాదాపు రెండు దశాబ్దాల కిందటి సంగతి. నరేష్ ‘అల్లరి’ సినిమా చేయడానికి ముందు చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే బాగా అల్లరి వాడట. ఆ అల్లరి భరించలేక.. అతను చదువు దెబ్బ తింటుందేమో అన్న సందేహంతో చెన్నై నుంచి పంపించేశాడట అతడి తండ్రి ఈవీవీ సత్యనారాయణ. అప్పటిదాకా చెన్నైలోనే చదువుతున్న నరేష్.. తండ్రి బలవంతం మీద హైదరాబాద్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్లో చేరాల్సి వచ్చిందట. ఐతే తొలి రోజు నుంచే అక్కడి వాతావరణం తనకు నచ్చలేదని.. అమ్మానాన్నలకు దూరంగా చాలా చాలా బాధపడ్డానని నరేష్ వెల్లడించాడు.

ఐతే అక్కడ హాస్టల్లో ఉండలేక.. బయటపడటానికి తానో ఎత్తు వేసినట్లు నరేష్ వెల్లడించాడు. అక్కడ హాస్టల్లో ఉండేవాళ్లందరూ తల్లిదండ్రులకు లెటర్ రాస్తే టీచర్లు దాన్ని పూర్తిగా చదివాకే పోస్ట్ చేసేవాళ్లట. ఐతే హాస్టల్లో అటెండరుగా పని చేసే ఒక వ్యక్తికి సినిమా పిచ్చి ఉందని తెలిసి.. తన తండ్రి సినిమాల్లో అవకాశం ఇస్తానన్న ఆశ చూపించి తాను రాసిన లెటర్ ఎవరికీ చూపించకుండా పోస్ట్ చేయించేలా ఉపాయం పన్నాడట. అప్పట్లో ఈవీవీ రాజమండ్రిలో ‘అబ్బాయిగారు’ షూటింగ్ లో ఉన్నారని తెలిసి.. ఆయన రెగులర్ గా బస చేసే హోటల్ కు కేవలం తన తండ్రి పేరు మాత్రమే రాసి లెటర్ పోస్టు చేసినట్లు నరేష్ వెల్లడించాడు. తాను హాస్టల్లో ఎంత ఇబ్బంది పడుతున్నది చెప్పి.. చివర్లో ఒక బొమ్మ వేసి దానికి కన్నీటి చుక్కలు గీసి.. తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లకపోతే ఎటైనా పారిపోతానని నరేష్ రాశాడట. ఆ లెటర్ ఈవీవీకి చేరిందట. ఆయన అది చదివాక నరేష్ ను ఇంటికి తీసుకొచ్చేశాడట. ఐతే అలా జరిగిన రెండు మూడు నెలల పాటు బుద్ధిగా ఉన్నానని.. తర్వాత మామూలేనని నరేష్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News