అల్ల‌రోడి సినిమా.. రిలీజ్ డేట్ మారింది

Update: 2016-11-08 17:30 GMT
ఈ మ‌ధ్య తెలుగులో కొత్త సినిమాల రిలీజ్ డేట్ల‌న్నీ కాస్త అటు ఇటు అవుతున్నాయి. ముఖ్యంగా నాగ‌చైత‌న్య సినిమా ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ అనుకోకుండా ఈ నెల 11న విడుద‌ల‌కు సిద్ధ‌మైపోవ‌డంతో వేరే సినిమాల రిలీజ్ డేట్లు మార్చుకోవాల్సి వ‌చ్చింది. నిఖిల్ సినిమా ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ వారం వాయిదా ప‌డ‌గా.. త‌ర్వాతి వారం రావాల్సిన ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ ఇంకో వారం వెన‌క్కి వెళ్లింది. తాజాగా అల్ల‌రి న‌రేష్ సినిమా ‘ఇంట్లో ద‌య్యం నాకేం భ‌యం రిలీజ్ డేట్ విష‌యంలోనూ చిన్న మార్పు చోటు చేసుకుంది. ఈ సినిమాను ముందు అనుకున్న‌ట్లు 11న కాకుండా 12న రిలీజ్ చేస్తున్నారు.

అల్ల‌రోడి సినిమాకు మంగ‌ళ‌వార‌మే సెన్సార్ పూర్త‌యింది. ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ వాళ్లు. వెంట‌నే 12న విడుద‌ల అని ప్ర‌క‌టించేశాడు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్. ‘సాహ‌సం శ్వాస‌గా సాగిపో’ మీద మంచి అంచ‌నాలున్న నేప‌థ్యంలో దాంతో పోటీ ప‌డితే తొలి రోజు ఓపెనింగ్స్ దెబ్బ తింటాయ‌న్న ఉద్దేశంతో శుక్ర‌వారం వ‌దిలేసి శ‌నివారం ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కామెడీ చిత్రాల స్పెష‌లిస్టు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి తొలిసారి తీసిన హార్ర‌ర్ కామెడీ ఇది. అల్ల‌రి న‌రేష్ హిట్టు కొట్టి చాలా కాల‌మైన నేప‌థ్యంలో ఈ చిత్రంపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు. కృతిక జ‌య‌కుమార్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News