OTTలో అమెజాన్ తోనే పోటీనా బాస్?

Update: 2020-01-25 05:26 GMT
ప్ర‌స్తుతం ఏ నోట విన్నా OTT ముచ్చ‌టే వినిపిస్తోంది. డిజిట‌ల్ తెర‌పై సినిమాల వీక్ష‌ణ అంత‌కంత‌కు పెరుగుతున్న ఈ ట్రెండ్ లో ఓటీటీ వేదిక‌ల‌పై నిరంత‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫీవ‌ర్ టాలీవుడ్ నిర్మాత‌ల‌కు పాకింది. సొంతంగా ఏదైనా ఓటీటీ వేదికను రెడీ చేసుకోవాల‌న్న ఆలోచ‌న మొద‌లైంది. బిజినెస్ ప‌రంగా క‌లిసొస్తుందంటే.. అందులో ఆచితూచి ఆలోచించే గ్రేట్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ సైతం ఈ వేదిక‌పై రంగ ప్ర‌వేశం చేయ‌డం ఆస‌క్తి గా మారింది. టాలీవుడ్ లో వంద‌లాదిగా నిర్మాత‌లు ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో ఎంద‌రో పారిశ్రామిక వేత్త‌లు.. బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నా వాళ్లంద‌రికంటే అడ్వాన్స్ డ్ గా ఆలోచించి ఆయ‌న త‌న‌కంటూ ఓ సొంత‌ ఓటీటీ వేదిక‌ను రెడీ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

గీతా ఆర్ట్స్ సినిమాల‌న్నీ ఇక‌పై ఈ వేదిక‌ పైనే స్ట్రీమింగ్ అయ్యే వీలుంద‌ని భావిస్తున్నారు. ఇన్నాళ్లు ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ గా అమెజాన్- నెట్ ఫ్లిక్స్- హాట్ స్టార్ వంటి వాటికి డిజిట‌ల్ రైట్స్ ని విక్ర‌యించారు. ఇక‌పై సొంత ఓటీటీ వేదిక‌ల‌పైనే సొంత సినిమాల్ని స్ట్రీమింగ్ చేస్తార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అర‌వింద్ సొంత ఓటీటీ `ఆహా` పేరుతో లాంచ్ అయ్యింది. ఆహా యాప్ గూగుల్ ప్లేస్టోర్ లోనూ ఉచితంగా అందుబాటులో ఉంది. ఇప్ప‌టికే ప‌లు టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని ఈ వేదిక‌ పై  స్ట్రీమింగు కి సిద్ధం చేశారు. ప్ర‌స్తుతానికి ఇందులో సినిమాల్ని ఉచితం గా వీక్షించే వెసులుబాటును క‌ల్పించారు. మునుముందు దానికి నెల‌వారీ ఫీజును.. వార్షిక ఫీజును నిర్ణ‌యిస్తారట‌.

బాస్ అల్లు అర‌వింద్ సొంత ఓటీటీని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి సిద్ధం చేశారు. ఇందుకోసం ప‌లువురు దిగ్గ‌జాల‌తో చేతులు క‌లిపారు. మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ (మా చానెల్ అధినేత‌).. మై హోమ్ రామేశ్వ‌ర‌రావు (10 టీవీ - టీవీ9 అధినేత‌) వంటి బిజినెస్ మ్యాగ్నెట్ల‌ తో చేతులు క‌లిపి సొంత ఓటీటీ `ఆహా` ను ఎంతో అడ్వాన్స్ డ్ గా ప్రారంభించారు. అమెజాన్.. నెట్ ఫ్లిక్స్ లాంటి కార్పొరెట్ దిగ్గ‌జాల‌తో పోటీప‌డుతూ ఈ వ్య‌వ‌స్థ‌ ను ర‌న్ చేయాల‌న్న‌ది వీళ్ల‌ ప్లాన్. దీనిని బ‌ట్టి బాస్ అర‌వింద్ ఆలోచ‌న ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుందో మ‌రోసారి అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కు ముందు మా చానెల్ లోనూ మ్యాట్రిక్స్ ప్ర‌సాద్ తో అర‌వింద్ - చిరంజీవి వంటి దిగ్గ‌జాలు భాగ‌స్వాములుగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. స్టార్ యాజ‌మాన్యానికి దాదాపు 2500 కోట్లకు మా చానెల్ ని విక్ర‌యించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. ప్ర‌స్తుత ఓటీటీ వేదిక వెన‌క అంత పెద్ద రేంజ్ ప్లాన్ ఉంటుంద‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News