'కాంతారా' విషయంలో అల్లు అరవింద్ పెద్ద తప్పు చేశారా..?

Update: 2022-11-03 02:30 GMT
శాండిల్ వుడ్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''కాంతారా''. 'కేజీఎఫ్' నిర్మాత విజయ్ కిరగండూర్ ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్ పై  నిర్మించారు. కన్నడ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం.. తెలుగు - హిందీ - మలయాళ భాషల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.

''కాంతారా'' చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ పై అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ ఏడాది 'కేజీఎఫ్ 2' తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రెండవ అతిపెద్ద డబ్బింగ్ చిత్రంగా 'కాంతారా' నిలిచింది.

'కాంతారా' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దాదాపు రూ.34 కోట్లు వసూలు చేసింది. ఫైనల్ రన్ ముగిసే సమయానికి రూ. 40 కోట్ల వరకూ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవడం మామూలు విషయం కాదు.

అయితే 'కాంతారా' ఇంత పెద్ద హిట్టైనా నిర్మాతలు అల్లు అరవింద్ మరియు బన్నీ వాస్ లకు ఈ సినిమా వల్ల పెద్దగా వచ్చేదేమీ లేదని తెలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమా తెలుగు హక్కులను కొనుగోలు చేయకుండా.. పర్సంటేజీ బేసిస్ మీద రిలీజ్ చేయడమే.

కన్నడలో 'కాంతారా' సినిమా చూసిన బన్నీ వాసు.. అల్లు అరవింద్ కు చెప్పడంతో.. తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అవుట్ రైట్ ప్రాతిపదికన కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గి కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేశారట. టోటల్ గ్రాస్ లో 10% మాత్రమే కమిషన్ తీసుకునేలా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చారు.

దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 'కాంతారా' సినిమా 40 కోట్లు వసూలు చేస్తే.. సినిమాను విడుదల చేసినందుకు గీతా ఆర్ట్స్ వారికి రూ. 4 కోట్లు మాత్రమే వస్తాయి. మిగిలినదంతా ఒరిజినల్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్‌ వారికి వెళ్తుందన్నమాట.

ఒకవేళ అల్లు అరవింద్ మరియు బన్నీ వాస్ ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులు పూర్తిగా కొనుగోలు చేసి ఉంటే.. అన్ని ఖర్చులు పోను 20 - 25 కోట్ల వరకూ మిగిలేది. కానీ గీతా ఆర్ట్స్ టీమ్ సక్సెస్ ని ముందే ప‌సిగ‌ట్టగలిగారు కానీ.. రైట్స్ కొనకుండా పెద్ద తప్పు చేశారనే కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News