బన్నీతో ఆ దర్శకుడు?

Update: 2018-08-30 06:59 GMT
ఇంతకుముందు లాగా తెలుగుకే పరిమితం అయిపోకుండా వేరే భాషల్లోనూ సినిమాలు చేస్తూ మార్కెట్ విస్తరించుకునే ప్రయత్నంలో పడుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. సూపర్ మహేష్ బాబు ఈ కోవలోనే ‘స్పైడర్’ చేశాడు. అది అ:తగా ఆడకున్నా.. మహేష్‌ కు తమిళంలో ఓ మోస్తరుగా మార్కెట్ తెచ్చింది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అతడికి కేరళలో మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన కూడా మంచి క్రేజే తెచ్చుకున్నాడు. కర్ణాటకలో కూడా అతడికి అభిమాన గణం భారీగానే ఉంది. ఐతే దక్షిణాదిన బన్నీ మార్కెట్ పెంచుకోవాల్సింది తమిళనాట మాత్రమే. ఇందుకోసం గత ఏడాది ఒక ప్రణాళిక రచించాడు. తమిళ టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు.. తమిళ ద్విభాషా చిత్రం చేయాలనుకున్నాడు.

ఐతే ఈ ప్రాజెక్టు గురించి ఘనంగా ప్రకటన అయితే ఇచ్చారు కానీ.. ఆ తర్వాత దాని గురించి ఊసే లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతుందట. కాకపోతే ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించడట. ఆయన స్థానంలో శివను దర్శకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. తెలుగులో ‘శౌర్యం’.. ‘శంఖం’.. ‘దరువు’ సినిమాలు రూపొందించిన శివ.. తమిళంలో చాలా పెద్ద రేంజికి వెళ్లిపోయాడు. ‘విక్రమార్కుడు’ రీమేక్ ‘సిరుత్తై’తో కోలీవుడ్లో అడుగుపెట్టిన శివ.. సూపర్ స్టార్ అజిత్ తో వరుసగా మూడు సినిమాలు తీశాడు. అందులో ‘వీరం’.. ‘వేదాలం’ బ్లాక్ బస్టర్లయ్యాయి. ‘వివేగం’ ఆడకపోయినా శివతోనే అజిత్ మళ్లీ ‘విశ్వాసం’ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత బన్నీ-జ్ఞానవేల్ రాజా సినిమాకు దర్శకత్వం వహించడానికి శివ ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయట. ‘విశ్వాసం’ అయ్యాక వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని మొదలుపెడతారని సమాచారం. దీని కంటే ముంద బన్నీ విక్రమ్ కుమార్ సినిమా చేసే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News