బన్నీ - మహేష్ ల మధ్య ఈ గొడవేంటీ?

Update: 2018-02-13 11:38 GMT

ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ ఎవైటెడ్ సినిమాలు మహేష్ బాబు భరత్ అను నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య. రెండూ డిఫరెంట్ స్టోరీలతో... భారీ తారాగణంతో... భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున్నాయి. మొదట్నించి ఈ రెండు సినిమాల విడుదల తేదీ పై రచ్చ జరుగుతూనే ఉంది. ఇదిగో ఇప్పుడు అది పీక్స్ కు పోయింది.

మొదట భరత్ అను నేను సినిమా ఏప్రిల్ 27 విడుదలవుతుందని ప్రకటించారు. అనుకోకుండా నా పేరు సూర్య కూడా ఏప్రిల్ 27నే విడుదల అని అనౌన్స్ చేశారు. ఈ పితలాటకం ఏంట్రా బాబు... రెండు పెద్ద సినిమాలు ఒకే రోజా అని తల పట్టుకున్నారు సినిమా పెద్దలు. ఏ సినిమా ముందు విడుదలకు సిద్ధమవుతుందో... అదే సినిమా ఏప్రిల్ 27న విడుదల చేయాలని ఓ పెదరాయుడి తీర్పు కూడా వచ్చినట్టు సమాచారం. మరిప్పుడేమైందో తెలియదు.  నాపేరు సూర్య ఏప్రిల్ 26న విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించాడు. అంతటితో కథ ఆగితే బాగుండేది. తెలుగు సినిమా కథ కదా... ఎందుకు ఆగుతుంది? మరో ట్విస్టు ఇచ్చింది భరత్ అను నేను చిత్ర యూనిట్.

ఇంతవరకు ఏప్రిల్ 27న విడుదల చేస్తామని చెప్పిన తమ సినిమాను 26నే విడుదల చేస్తామని ప్రకటించారు. కేవలం గంట తేడాతో ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. బన్నీ- ప్రిన్స్ సినిమాల మధ్య ఈ టగ్ ఆఫ్ వార్ ఎందుకవుతోంది? ఇలా గొడవలు పడితే ఎవరికి లాభం? అయినా అవేవీ పట్టించుకునే పరిస్థితుల్లో లేవు ఆ రెండు సినిమాల యూనిట్లు. పందెంకోళ్లలా రెచ్చిపోతున్నారు.

రెండూ సినిమాలు ఒకే రోజు విడుదలైతే... ఏ సినిమాకు లాభం రాకుండా పోతుందేమోనని అంటున్నారు సినీ విశ్లేషకులు. నష్టపోయేది నిర్మాతలు, బయ్యర్లే కనుక వారే ఓ నిర్ణయం తీసుకుంటే బెటర్ అంటున్నారు సినీ జనాలు.
Tags:    

Similar News