ఇప్పుడు చూపించు సత్తా బన్నీ..

Update: 2018-05-05 23:30 GMT
గత కొన్నేళ్లలో అల్లు అర్జున్ ఫాలోయింగ్.. మార్కెట్ ఎలా పెరిగాయో తెలిసిందే. దక్షిణాదిన మరే హీరో అలా రైజ్ కాలేదంటే అతిశయోక్తి కాదు. నాలుగేళ్లలో అతడి మార్కెట్ దాదాపు రెట్టింపైందంటే ఆశ్చర్యపోవాల్సిందే. బన్నీ ఫాలోయింగ్ ఎలా పెరిగిందంటే డివైడ్ టాక్ తెచ్చుకున్న అతడి సినిమాలు కూడా భారీగా వసూళ్లు రాబట్టాయి. ‘సరైనోడు’ అలాంటి టాక్‌ తోనే బ్లాక్ బస్టర్ అయింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ డివైడ్ టాక్ తెచ్చుకునే రూ.50 కోట్లకు పైగా షేర్ సాధించి యావరేజ్ అనిపించుకుంది. గత ఏడాది ‘డీజే’ నెగెటివ్ టాక్ ను అధిగమించి భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ వసూళ్లలో వాస్తవమెంత అనే చర్చ కూడా జరిగిన మాట వాస్తవమే కానీ.. దానికి వచ్చిన కలెక్షన్లయితే ఆశ్చర్యపరిచాయి. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి హీరోల సినిమాలకు నెగెటివ్ టాక్ వస్తే దారుణంగా దెబ్బ తింటున్నపుడు అల్లు అర్జున్ మాత్రం ఏదో మ్యాజిక్ చేయగలుగుతున్నాడంటూ అతడినందరూ ఆకాశానికెత్తేశారు.

కట్ చేస్తే ఇప్పుడు ‘నా పేరు సూర్య’ రిలీజైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. మరి ఈసారి గతంలో మాదిరే బన్నీ మ్యాజిక్ చేస్తాడా.. డివైడ్ టాక్‌ ను అధిగమించి అద్భుత ఫలితాలు సాధిస్తాడన్న ముద్రను నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి. ఎప్పట్లాగే బన్నీ పీఆర్ టీం మాత్రం ఈ సినిమా అద్భుతమని.. కలెక్షన్లు కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయని ఊదరగొట్టేస్తోంది. కానీ ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తే పరిస్థితి కొంచెం తేడాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీకెండ్లో వసూళ్లు ఎలా ఉంటాయి.. ఆ తర్వాత సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది చూడాలి. ఇప్పుడు కూడా అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టి సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లగలిగాడంటే బన్నీ బాక్సాఫీస్ మొనగాడనిపించుకుంటాడు. చూద్దాం ఏమవుతుందో?
Tags:    

Similar News