న‌వ్వుల జ‌ల్లు అల్లు రామ‌లింగ‌య్య‌!

Update: 2022-07-31 06:30 GMT
లెజెండ‌రీ న‌టుడు అల్లు రామ‌లింగ‌య్య సినీ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌మెడీయ‌న్‌గా వేయి చిత్రాల‌కు పైగా నటించి అల‌రించిన న‌ట దిగ్గ‌జం.  జనం మదిలో ఇల్లు కట్టుకొని మరీ గిల్లుతూ అల్లువారు నవ్వుల పంటలు పండించారు. గిల్లిన ప్రతీసారి మళ్ళీ మొలిచే పంటలవి. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు.

బాల్యం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచ సాగారు. నేడు ఆ న‌వ్వుల రారాజు అల్లు రామ‌లింగ‌య్య వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఆయ‌న జ్ఞాప‌కాల్ని కుటుంబ స‌భ్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ట్విట‌ర్ వేదిక‌గా గీతా ఆర్స్ట్ రామ‌లింగ‌య్య ఫోటోని  షేర్ చేసింది.  

రామ‌లింగ‌య్య‌ చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ ఇచ్చారు. యవ్వనంలో కులమతవిభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు. తన ముందు ఓ నిమ్నకులస్థుడిని అగ్రవర్ణాల వారు అవమానిస్తే ఉరకలు వేసే ఉడుకు నెత్తురుతో వారికి దేహశుధ్ధి చేసిన వీరుడు.

అల్లు రామలింగయ్యని  గరికపాటి రాజారావు తన 'పుట్టిల్లు' చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్.. ఏయన్నార్..కృష్ణ‌..శోభ‌న్ బాబు హీరోలుగా రూపొందిన అనేక చిత్రాల్లో న‌టించారు. నాటి-మేటి న‌టుల‌తోనూ రామ‌లింగ‌య్య సినీ ప్ర‌యాణం ఎంతో గొప్ప‌ది.

ఇక ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు.. రివార్డులకు చోటుంది.  రేలంగి తరువాత 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్న హాస్యనటులుగా చరిత్రలో నిలిచారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు.
తేజ దర్శకత్వంలో రూపొందిన `జై` చిత్రంలో అల్లు రామలింగయ్య చివరి సారి తెరపై కనిపించారు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు.

అల్లు రామ‌లింగ‌య్య వార‌స‌త్వాన్ని అల్లు అరవింద్ నిర్మాత‌గా కొన‌సాగిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో అర‌వింద్ ఒక‌రు. ఇక రామ‌లింగ‌య్య మ‌న‌వ‌లు అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాత‌య్య న‌ట  వార‌స‌త్వాన్ని బ‌న్నీ దిగ్విజ‌యంగా కొన‌సాగిస్తున్నాడు .ఇక  రెండ‌వ మ‌న‌వ‌డు శిరీష్  హీరోగా నిల‌దొక్కుకునే ప‌నిలో ఉన్నాడు.

మ‌రో మ‌న‌వ‌డు బాబి నిర్మాత‌గా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు.  ఆర‌కంగా అల్లు కుటుంబం టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డింది. ఇక అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అల్లు బ్రదర్స్‌ ఆవిష్కరించిన సంగ‌తి  తెలిసిందే. హైదరాబాద్‌లోని అల్లు స్టూడియోస్‌లో  కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు.
Tags:    

Similar News