మెగాస్టార్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన 'అల్లు స్టూడియోస్'

Update: 2022-10-01 06:43 GMT
అల్లు ఫ్యామిలీ కూడా స్టూడియో వ్యాపారంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా నిర్మాణం మరియు ఓటీటీ రంగంలో రాణిస్తున్న అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. ఇప్పుడు 'అల్లు స్టూడియోస్' ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈరోజు స్టూడియోస్‌ ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.

రెండేళ్ల క్రితం 'అల్లు స్టూడియోస్‌' ను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన అల్లు కుటుంబం.. అదే రోజున పనులు మొదలు పెట్టింది. అనతికాలంలోనే నిర్మాణం పూర్తి చేసి షూటింగులకు రెడీ చేసింది. నేడు లెజండరీ నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల్లో భాగంగా.. సినీ స్టూడియోస్ ని ప్రారంభించారు.

హైదరాబాద్ లోని నార్సింగి - కోకాపేట ప్రాంతంలో అల్లు స్టూడియోని నిర్మించారు. అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ఆయన అల్లుడు చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా స్టూడియోని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అల్లు ఫ్యామిలీ మరియు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చిరంజీవి - సురేఖ దంపతులు - అల్లు అరవింద్ - అల్లు అర్జున్ - స్నేహరెడ్డి - అల్లు శిరీష్ - బాబీ (వెంకటేష్) - నాగబాబు - శ్రీజ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

చిరంజీవి రిబ్బన్ కట్ చేసి స్టూడియోని ఓపెన్ చేసిన అనంతరం అల్లు రామలింగయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. అలానే అల్లు ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అల్లు రామలింగయ్య 100వ జయంతి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడారు.

కాగా, దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య పేరు చిరస్థాయిగా నిలిచేలా 'అల్లు స్టూడియోస్' నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నగర శివార్లలో మొత్తం 10ఎకరాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే ఒక స్టూడియో ఫ్లోర్ పూర్తవ్వగా.. మరో స్టూడియో ఫ్లోర్ నిర్మాణంలో ఉంది.

ఇప్పటికి ఇండోర్ సినిమాలు - ఓటీటీ సిరీసుల షూటింగ్స్ కోసం సిద్దమవుతున్న ఈ స్టూడియో.. భవిష్యత్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేసుకోవడానికి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. 'అల్లు స్టూడియోస్' లో చిత్రీకరణ జరుపుకునే మొదటి సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' అవుతుందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News