మెగాస్టారూ.. సైలెన్స్ ఏంది???

Update: 2017-08-23 10:20 GMT
రోజంతా చాలా పనుల్లో బిజీగా ఉంటూ అర్ధరాత్రి పూట ట్వీట్లు వేయడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన గత అర్దరాత్రి ఏదన్నా సినిమా గురించి ఓ నాలుగు ముక్కలు చెబుతాడేమోనని చాలామంది సినిమా లవ్వర్స్ ఎదురు చూశారు. కాని ఆయన మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు. అస్సలు ఒక్క ట్వీటంటే ఒక్కటి కూడా వెయ్యలేదు. ఆయెనెవరో కాదు.. మెగాస్టార్ అమితాబ్ బచ్చనే.

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 'సైరా' సినిమా టైటిల్ లుక్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. మన జగపతి బాబు.. ఈగ విలన్ సుదీప్.. ఇలా చాలామందే ఉన్నారని ప్రకటించారు. అదే విషయంపై ఒకవేళ అమితాబ్ బచ్చన్ అర్ధరాత్రి ఏమన్నా ట్వీటేస్తారేమో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాని అమితాబ్ మాత్రం ఈ సినిమా గురించి అస్సలు ఒక్కమాటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. కనీసం ఏదన్నా ట్వీటును రీట్వీట్ కూడా చేయలేదు. ఒక ప్రక్కన సౌత్ ఇండియా అంతా బిగ్ బి ఈ సినిమాలో చేస్తున్నారని నానా హంగామా చేస్తోంది కాబట్టి.. ఆయనకు ఈ ప్రాజెక్టు న్యూస్ తెలియకుండా ఉండదు. కాని ఈ సైలెన్స్ ఎందుకు మరి?

అమితాబ్ మాత్రమే కాదు.. సైరా సినిమా గురించి ఏ.ఆర్.రెహ్మాన్ కూడా అస్సలు స్పందించలేదు. కనీసం నామమాత్రం రీట్వీట్ చేయడం కూడా చేయలేదు. ఇదంతా చూస్తుంటే ఫ్యాన్స్ కు గుండెల్లో గుబులుగా ఉందట. అయితే కొణిదెల ప్రొడక్షన్స్ వారు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చెప్పినప్పుడు.. ఎక్కడా కూడా ఆ సెలబ్రిటీలను ట్యాగ్ చేయలేదు. దానితో వారు కూడా స్పందించలేదేమో. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News