బ్రేకింగ్‌ : మెగాస్టార్‌ కు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం

Update: 2019-09-24 15:35 GMT
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించింది. భారత సినీ రంగంలో అత్యున్నత సేవలు అందించిన వారికి గాను అందించే ఈ అత్యుత్తమ పురస్కారం ఈ ఏడాదికి గాను అమితాబచ్చన్‌ కు ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ప్రకటించారు. ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. గత 60 ఏళ్లుగా భారత సినీ పరిశ్రమకు సేవలందిస్తున్న అమితాబచ్చన్‌ కు ఈ పురస్కారం ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

అమితాబచ్చన్‌ కు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం రావడం పట్ల ఆయన అభిమానులు మరియు శ్రేయోభిలాషులు సంతోషంలో మునిగి పోయారు. సుదీర్ఘ కాలంగా సినిమా పరిశ్రమలో కొనసాగుతూ దాదాపు 200 పై చిలుకు సినిమాల్లో నటించిన అమితాబచ్చన్‌ కు ఆలస్యంగా అయినా అత్యున్నత పురస్కారం దక్కినందుకు సంతోషం అంటూ అభిమానులు బిగ్‌ బి కి సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలు భాష సినీ ప్రముఖులు అంతా కూడా బిగ్‌ బిని అభినందిస్తున్నారు.

కనీసం డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పనికిరాడు అంటూ గతంలో గెంటివేయించుకున్న అమితాబచ్చన్‌ అదే వాయిస్‌ తో కోట్లాది మంది ఇండియన్స్‌ ను ఉర్రూతలూగించడంతో పాటు తన నటనతో ఇండియన్‌ సినిమా స్థాయిని మార్చేశాడు. అమితాబ్‌ నటించిన 'షోలే' చిత్రం ఇండియన్‌ సినీ చరిత్రలో చిరష్మరణీయంగా నిలిచి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ అత్యున్నత రెండవ పురష్కారం అయిన పద్మ విభూషన్‌ అందుకున్న బిగ్‌ బి తక్కువ సమయంలోనే దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నారు.

ప్రస్తుతం హిందీలో పలు చిత్రాలను చేస్తున్న అమితాబచ్చన్‌ తెలుగులో 'సైరా' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సైరా చిత్రంలో చిరంజీవి గురువు పాత్రలో అమితాబచ్చన్‌ నటించిన విషయం తెల్సిందే. మరో వారం రోజుల్లో సైరా విడుదల కాబోతున్న సమయంలో బిగ్‌ బికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడంతో సైరా యూనిట్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News