'వీరమల్లు'లో ప్రతి సెట్ ఒక హైలెట్!

Update: 2022-01-30 07:48 GMT
మొదటి నుంచి కూడా పవన్ కల్యాణ్ యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన కథలను ఎక్కువగా చేస్తూ వచ్చాడు. ఈ రెండింటికి కూడా ఆయన మాస్ టచ్ ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు. అయితే తన కెరియర్లోనే మొదటిసారిగా ఆయన చారిత్రక నేపథ్యం కలిగిన కథను చేస్తున్నాడు. అదే .. 'హరి హర వీరమల్లు'.  మొగల్ కాలంలో నడిచే ఈ కథలో ఆయన ఒక దొంగ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూ పోతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు.

మొగల్ కాలంలో నడిచే కథ కావడం వలన ఆనాటి కట్టడాలకు సంబంధించిన భారీ సెట్లు వేయిస్తున్నారు. టాలీవుడ్ లో భారీ సెట్లు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ఆనంద్ సాయి. ఆయనే ఈ సినిమాకి సంబంధించిన సెట్లు వేస్తున్నాడు. పవన్ కి ఆయనకి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన పని తీరుపై పవన్ కి మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఆనంద్ సాయి మరింత కేర్ తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 'వీరమల్లు' సినిమా సెట్ల విషయంలోను ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆనంద్ సాయి మాట్లాడుతూ .. 'వీరమల్లు' ఒక అద్భుతమైన కథ. అందుకు తగిన సెట్స్ వేయడం కూడా ఒక ఛాలెంజ్ వంటిదే. నిజం చెప్పాలంటే ఎవరి టాలెంట్ ను వారు నిరూపించుకోవడానికి పూర్తి అవకాశం ఉన్న ప్రాజెక్టు ఇది. అలాంటి ఒక ప్రాజెక్టులో నేను భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే కొన్ని సెట్లు పూర్తికాగా, మరొకొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నాము. ఫిబ్రవరి .. మార్చి నెలల్లో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ మొదలవుతుంది. అప్పటికీ మా వర్క్ పూర్తవుతుంది. ఈ సినిమా హైలైట్స్ కి సెట్స్ కూడా భాగమవుతాయనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

'హరి హర వీరమల్లు' సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. 'పంచమి' అనే పాత్రలో ఆమె అందాల సందడి చేయనుంది. కొన్ని ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ నటీనటులు కూడా కనిపించనున్నారు. ఇక పవన్ తాజా చిత్రమైన 'భీమ్లా నాయక్' సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరో ప్రధానమైన పాత్రలో రానా కనిపించనున్న ఈ సినిమాకి, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించాడు. వచ్చేనెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది మరి.
Tags:    

Similar News