'ఎఫ్ 3': ఒకరికి రేచీకటి.. మరొకరికి నత్తి..!

Update: 2021-11-23 06:38 GMT
'పటాస్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కమర్షియల్ కథలకు తనదైన శైలి కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో 'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' 'ఎఫ్ 2' 'సరిలేరు నీకెవ్వరూ' వంటి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం 'ఎఫ్ 3' షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి.. త్వరలో నందమూరి బాలకృష్ణ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు అనిల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఎఫ్‌ 3’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'ఎఫ్‌ 2' లో భార్యాభర్తల మధ్య కథకు ఫన్‌ - ఫస్ర్టేషన్‌ కలిపి చూపించాం. ఈసారి దానికి డబ్బు అనే ఎలిమెంట్‌ యాడ్ అవుతోంది. అవే పాత్రలు కనిపిస్తాయి.. అవే క్యారెక్టరైజేషన్లు ఉంటాయి. కాకపోతే ఇది పూర్తిగా కొత్త కథ. కొన్ని కొత్త పాత్రలు, కొత్త బాధలు ప్రవేశిస్తాయి.

ఏ పాత్ర వచ్చినా, ఏం చేసినా, ప్రేక్షకుల్ని నవ్వించడానికే. ఇందులో మేనరిజమ్స్ కోసమని ప్రత్యేకంగా సంభాషణలేమీ రాయలేదు కానీ.. ఆ పాత్రలు చేసే పనులు బాగా నవ్విస్తాయి. ఇందులో వెంకటేష్ రేచీకటి బాధితుడిగా.. వరుణ్ నత్తిగా మాట్లాడే యువకుడిగా కనిపిస్తారు. అక్కడక్కడా అలా కనిపించినా ప్రేక్షకులు మాత్రం బాగా నవ్వుకుంటారు. వాళ్లిద్దరికే కాదు, ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. 'ఎఫ్‌ 2' ని మించి ‘ఎఫ్‌ 3’ ఎంటర్టైన్ చేయబోతోంది అని అన్నారు.

''నిజానికి ఎఫ్‌ 2 తీస్తున్న సమయంలో ఎఫ్‌ 3 కథ గురించి ఆలోచన లేదు. హిందీ 'గోల్ మాల్' తరహాలో మనకు కూడా ఇదొక ఫ్రాంచైజీలా ఉంటే బాగుంటుంది కదా అనే ఆ సినిమా చివర్లో ఎఫ్‌ 3 లోగో వేశాం. డబ్బు నేపథ్యంలో ఓ మంచి కాన్సెప్ట్ కుదరడంతో సినిమాని పట్టాలెక్కించాం.

డబ్బు కోసం మనం నిత్యం చేసే ప్రయత్నాల్లో చాలా ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంటుంది కదా. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాం. మనందరికీ అనుభవమైన విషయాలే కాబట్టి ఇది ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ‘ఎఫ్2’ ఇచ్చిన ఉత్సాహమో మరేమో తెలియదు కానీ.. వెంకటేష్ - వరుణ్ తేజ్ ఈసారి ఇంకా బాగా చేశారు. కచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువే నవ్వుకుంటారు'' అని అనిల్ రావిపూడి తెలిపారు.

''కరోనా పాండమిక్ నుంచి మళ్లీ ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్ లోకి వస్తున్నాం. ఈ ఒత్తిడిని తీసేయడానికి రెండున్నర గంటల మెడిసిన్ లా ‘ఎఫ్ 3’ ఉంటుంది. ఈసారి సంక్రాంతికి రావడం లేదనే విషయం కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. ‘ఎఫ్2’ ‘సరిలేరు నీకెవ్వరూ’ వరుసగా సంక్రాంతికే విడుదలయ్యాయి.

ఇది కూడా వచ్చుంటే హ్యాట్రిక్ అయ్యుండేది. ఈసారి RRR వంటి పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి. మార్కెట్ పరంగా అన్ని లెక్కలు వేసుకొని సోలోగానే వద్దామని నిర్ణయించాం. ‘ఎఫ్-3’ ఎప్పుడొస్తే అప్పుడే పండగ అని భావిస్తున్నాం'' అని అనిల్ చెప్పుకొచ్చారు. తదుపరి సినిమా బాలయ్య తోనే ఉంటుందని.. జనవరి నుంచి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉందని బ్లాక్ బస్టర్ దర్శకుడు తెలిపారు.


Tags:    

Similar News