ప్చ్...అజ్ఞాతవాసికి మరో రికార్డ్

Update: 2018-01-24 08:53 GMT
అదేంటి సినిమా డిజాస్టర్ అన్నారు కదా మళ్ళి రికార్డుల మాటేమిటి అని ఆశ్చర్యపోకండి. నిజంగానే అజ్ఞాతవాసి రికార్డుల పర్వం కొనసాగుతోంది. కాకపోతే నెగటివ్ గా. అంతే తేడా. సంక్రాంతి మొదటి సినిమాగా బరిలో దూకిన ఈ మూవీకి ఊహించని రీతిలో మాస్టర్ స్ట్రోక్ తగలటంతో బయ్యర్లు ఇప్పుడిప్పుడే కోలుకోవడం కష్టంగానే ఉంది. దాదాపు 125 కోట్లు థియేటట్రికల్ రైట్స్ కే అమ్మకాలు జరిగిన అజ్ఞాతవాసి ఇప్పటి దాకా షేర్ రూపంలో ఇంకా 60 కోట్లు కూడా తీసుకురాలేదు. 58 కోట్ల దాకా వచ్చి ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ బాగా డీలా పడిన కలెక్షన్లు ఏ మాత్రం పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం థియేటర్స్ లో ఉంది కాని చాలా చోట్ల తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చిన షేర్ ప్రకారం చూసుకుంటే ఇంకా 70 కోట్ల దాకా రావాలి. అది అసాధ్యం కాబట్టి ఇది తెలుగులోనే అతి పెద్ద డిజాస్టర్ గా నిలవనుందా అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

నిజానికి ఇంత భారీ స్థాయి డిజాస్టర్లు ఏ హీరోకు లేవా అంటే ముమ్మాటికి ఉన్నాయి. చిరంజీవి మొదలుకొని రాజ్ తరుణ్ దాకా డిజాస్టర్ లేని హీరో టాలీవుడ్ లోనే కాదు ఏ బాషలోను లేడు. కాని అది ఎంత మోతాదులో ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన మహేష్ బాబు స్పైడర్ ఇంచుమించు ఇదే ఫలితాన్ని అందుకుంది. కాని ఇంత భారీ రేట్లకు సినిమాను అమ్మకపోవడం వల్ల నష్టాలు 40 కోట్ల దాకా మిగిలాయి. రజనికాంత్ కబాలి సైతం ఇదే క్యాటగిరిలోకి వస్తుంది. ఓపెనింగ్స్ - అడ్వాన్సు బుకింగ్స్ తో కొంత నయం అనిపించుకుంది కాని దానికీ 35 కోట్ల దాకా నికరంగా నష్టం మిగిలింది. రజని లింగా - కొచ్చాడయన్ లది కూడా అదే పరిస్థితి. కాని అవన్నీ వంద కోట్ల లోపే బిజినెస్ పూర్తి చేసుకున్న సినిమాలు.

కాని అజ్ఞాతవాసి నూటా పాతిక కోట్లకు అమ్మడమే ఇంత చేదు ఫలితం వచ్చేలా చేసింది. యావరేజ్ టాక్ వచ్చినా ఎంతో కొంత గట్టెక్కెది కాని పూర్తి డిజాస్టర్ టాక్ రావడంతోనే కథ ముగిసింది. నష్టాలను భర్తీ చేసే విషయంగా నిర్మాతకు,  పంపిణిదారులకు చర్చలు జరుగుతున్నాయి అని వార్తలు వస్తున్నాయి. సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే రోజులు పోయి ఎంత తీసుకొచ్చింది అనే లెక్కలే సినిమా విజయానికి ప్రామాణికంగా మారిన పరిస్థితుల్లో 70 కోట్ల నష్టం అనే పవర్ ఫుల్ షాక్ ఇచ్చిన అజ్ఞాతవాసి నుంచి తేరుకోవడానికి కొంత టైం పట్టడం ఖాయం.
Tags:    

Similar News