హిందీ రానోడు సినిమా చేస్తే ఫ‌లితాలు అంతే! అనురాగ్ క‌శ్య‌ప్

Update: 2022-07-28 08:30 GMT
బాలీవు డ్ కి రెండేళ్ల‌గా స‌రైన స‌క్సెస్ లేని మాట వాస్త‌వం. అత్యధిక‌ వ్య‌యంతో తెర‌కెక్కిన సినిమాల‌న్నీ భారీ అంచ‌నా ల‌మ‌ధ్య రిలీజ్ అయి విఫ‌ల‌మ‌య్యాయి. క‌నీసం వ‌సూళ్ల‌ని సైతం తేలేక‌పోయాయి. గ‌తంలో ఎన్న‌డు ఇంత దారుణ‌మైన ప‌రిస్థి లేదు. ఒక‌రు కాక‌పోతే మ‌రో హీరో అయినా క‌నీస ఫ‌లితాల‌తో నిల‌బ‌డేవారు. కానీ కోవిడ్ ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ లో పరాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.

ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన కొన్ని సినిమాలే కాస్తో..కూస్తో బాలీవుడ్ ప‌రువు నిల‌బెట్టాయి. బాలీవుడ్ లో  ఈ ర‌క‌మైన అనిశ్చితి ప‌రిశ్ర‌మ మొత్తాన్ని తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గురి చేస్తుంది. ఈ నేప‌థ్యంలో  ర‌చ‌యిత‌లు..డైరెక్టర్లు విమ‌ర్శ‌కుల‌కు టార్గెట్ అవుతున్నారు. దీనికితోడు సౌత్ ప‌రిశ్ర‌మ‌లు వ‌రుస విజ‌యాల‌తో ముందుకెళ్ల‌డం హిందీ ప‌రిశ్ర‌మ‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

పాన్ ఇండియాని దాటి..పాన్ వ‌ర‌ల్డ్  ని రీచ్ అవుతోన్న సౌత్ కంటెంట్ పై హాలీవుడ్ సైతం ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో బాలీవుడ్ కి పుండు మీద కార‌జల్లిన‌ట్టు అయింది. దీంతో బాలీవుడ్-   సౌత్ ఇండ‌స్ర్టీస్ ని చూసి నేర్చుకోవాలంటూ కొంత మంది క్లాసులు పీక‌డం మొద‌లైంది. స‌ల్మాన్ ఖాన్...అమీర్ ఖాన్..క‌ర‌ణ్ జోహార్.. షారుక్ ఖాన్ లాంటి వారు సౌత ప‌రిశ్ర‌మ‌ల వైపు చూడ‌టం మ‌రింత భంగ‌పాటుగా మారింది.

తాజాగా హిందీ వైఫ‌ల్యాల్ని  ద‌ర్శ‌క‌-నిర్మాత అనురాగ్ క‌శ్య‌ప్ కూడా స్వాగ‌తించారు. బాలీవుడ్ లో స‌క్సెస్ రేటు త‌గ్గ‌డానికి కార‌ణం  సంస్కృతి..మూలాల్లోకి వెళ్ల‌క‌పోవ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణంగా చెప్పుకొచ్చారు.`` చాలా మంది దర్శ‌కుల‌కు తాము సినిమా రూపొందించే భాష కూడా తెలియ‌దు. ఇది సినిమాపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

ఇంగ్లీష్ త‌ప్ప హిందీ మాట్లాడ‌టం రాని హిందీ  సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాంటి వాళ్లు క‌థ మూలాల్లోకి వెళ్ల‌డం ఎలా సాధ్య‌ప‌డుతుంది? క‌థ‌పై లోతైన అధ్య‌య‌నం చేయ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు.  అనురాగ్  ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `దొబారా` ట్రైల‌ర్ లాంచ్ ముంబై వేదిక‌గా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు బాలీవుడ్ అంత‌టా హాట్ టాపిక్ గా మారింది.

ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఈ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారి తీసే అవ‌కాశం ఉంది. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం అనురాగ్ కి కొత్తేం కాదు. గ‌తంలోనూ ప‌లు అంశాల‌పై ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. అయితే ఈసారి వ్యాఖ్య‌ల్లో కొంత వ్య‌క్తిగ‌తం క‌నిపిస్తుంది.  
Tags:    

Similar News